అన్నంపెట్టే ఇండస్ట్రీకి 'చిరు' సాయం... సినీ కార్మికుల కోసం రూ.కోటి

chiranjeevi
ఠాగూర్| Last Updated: గురువారం, 26 మార్చి 2020 (17:36 IST)
తనను పెంచిపోషించి, ఇంతవాడిని చేసిన సినీ ఇండస్ట్రీ రుణం తీర్చుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎపుడు అవకాశం వచ్చినా ఆయన తన కర్తవ్యాన్ని పూర్తిచేసే పనిలో నిమగ్నమవుతున్నారు. తాజాగా కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో సినీ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది పేద కళాకారులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. ఇలాంటివారిని ఆదుకునేందుకు చిరంజీవి ముందుకు వచ్చారు.

ఇందులోభాగంగా, ఆయన సినీ కార్మికుల కోసం ఏకంగా కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. కరోనా విలయంతో లాక్ డౌన్ తప్పనిసరి కావడంతో దినసరి కూలీలు, అల్పాదాయ వర్గాలపైనేకాకుండా సినీ కార్మికులపైనా తీవ్ర ప్రభావం పడింది. దీన్ని గుర్తించిన చిరంజీవి... వారికి తనవంతు సాయంగా ఈ విరాళం ప్రకటించారు. తన విరాళం సినీ కార్మికులకు ఉపకరిస్తుందని భావిస్తున్నానని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

మరోవైపు, కరోనా బాధితులను ఆదుకునేందుకు చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ కూడా తమ వంతు సాయంగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ముఖ్యంగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఏకంగా రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.50 లక్షలు చొప్పున రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే, చిరంజీవి కూడా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి రూ.70 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.దీనిపై మరింత చదవండి :