1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (09:24 IST)

ప్రేమ కావ్యంలా రాబోతున్న డియర్ ఉమ

Sumaya Reddy, Prithvi Amber
Sumaya Reddy, Prithvi Amber
ఓ తెలుగు అమ్మాయి తెరపై హీరోయిన్‌గా కనిపించడం.. అందులోనూ నిర్మాతగా వ్యవహరించడం.. దానికి మించి అన్నట్టుగా కథను అందించడం అంటే మామూలు విషయం కాదు. అలా ఇప్పుడు సుమయ రెడ్డి తన బహు ముఖ ప్రజ్ఞతో అందరినీ ఆకట్టుకోనున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద డియర్ ఉమ అనే చిత్రం త్వరలోనే రాబోతోంది.

ఇందులో సుమయ రెడ్డి, దియా మూవి ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుమయ రెడ్డి నిర్మాతగా.. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్వవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటున్నారు.
 
వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఇక ఈ టీజర్ చూస్తుంటే ఇదొక ప్రేమ కావ్యంలా అనిపిస్తుంది. ప్రేమ ఇచ్చే సంతోషాన్ని, బాధను ఓ దృశ్యకావ్యంగా మలిచినట్టు అనిపిస్తుంది. ‘నా కణాల్లో జీవం నీ కళ్లు.. నా నరాల్లో ప్రవాహాం నీ చూపు’,  ‘ప్రేమ అనేది ఓ అనిర్వచనీయమైన నిర్వచనం’, ‘అబ్బాయిల ప్రేమలో స్వార్థం ఉండదు.. అమ్మాయిల స్వార్థంలోనే ప్రేమ ఉంటుంది.. అమ్మాయిలు ఇచ్చే షాక్‌లకు.. అబ్బాయిలకు ఇదే సరైన మెడిసిన్’ అనే డైలాగ్స్ సినిమాలోని డెప్త్‌ను చాటుతున్నాయి.
 
అందమైన ప్రేమ కథా చిత్రంగా డియర్ ఉమ రాబోతోందని టీజర్‌తో స్పష్టమైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
 
రాజ్ తోట కెమెరామెన్‌గా, రధన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్న ఈ చిత్రంలో కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ వంటి వారు నటించారు.