మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని ప్రసిద్ధ మానసాదేవి ఆలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే కారణమని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ హరిద్వార్‌లోని ప్రసిద్ధ మానసాదేవి ఆలయంలో ఆదివారం ఉదయం తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. కరెంట్ షాక్ పుకారే ఈ ఘోర విషాదానికి కారణమని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) మయూర్ దీక్షిత్ మాట్లాడుతూ "విద్యుత్ తీగ తెగిపోయిందనే పుకారును ఎవరో వ్యాప్తి చేశారని ఫోటోలు, వీడియోల ద్వారా తెలిసింది. గాయపడిన వారు, మృతులు విద్యుత్ షాకు గురైనట్టు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ పుకారును ఎవరు వ్యాప్తి చేశారనే దానిపై దర్యాప్తు చేస్తాం. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించాం. సీసీటీవీ కెమెరాలు, ఇతర మార్గాలను పరిశీలిస్తాం. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు" అని తెలిపారు.
కొండలపై 500 అడుగుల ఎత్తులో ఉన్న మానసాదేవి ఆలయం, హరిద్వార్‌లోని పంచ తీర్థాలలో ఒకటి. ఇది పాముల దేవత మా మానసా దేవి ఆలయం, పురాతన సిద్ధపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రగాఢ సానుభూతి తెలిపారు. "హరిద్వార్‌లోని మానసాదేవి ఆలయ మార్గంలో జరిగిన తొక్కిసలాట బాధాకరం. స్థానిక పోలీసులు, ఇతర సహాయక బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. స్థానిక యంత్రాంగంతో నిరంతరం సంప్రదిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నాను. భక్తుల భద్రత కోసం మాతృదేవతను ప్రార్థిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.