ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి
తాను ఒక అద్భుతమైన చిత్రాన్ని చూశానని, ఎవరు కూడా మిస్ కావొద్దంటూ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. తమిళ హీరో శశికుమార్, సిమ్రాన్ జంటగా నటించిన చిత్రం "టూరిస్ట్ ఫ్యామిలీ". ఈ నెల ఒకటో తేదీన విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని రాజమౌళి తాజాగా చూసి తన స్పందనను తెలియజేశారు. ఈ సినిమా తనకు గొప్ప అనుభూతినిచ్చిందని, ఇటీవలి కాలంలో తాను చూసిన అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటని కొనియాడారు.
'టూరిస్ట్ ఫ్యామిలీ' అనే అద్భుతమైన సినిమాను చూశాను. ఈ చిత్రం తనను ఎంతగానో ఆకట్టుకుంది. మనసును హత్తుకోవడమేకాకుండా కడుపుబ్బా నవ్వించే హాస్యంతో ఉంది. కథనం మొదటి నుంచి చివరి వరకు ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను లీనం చేస్తుందని వివరించారు.
చిత్ర దర్శకుడు అభిషన్ జీవింత్ రచన, దర్శకత్వం చాలా గొప్పగా ఉంది అంటూ పనితీరును మెచ్చుకున్నారు. ఇలాంటి ఒక మంచి సినిమాను అందించినందుకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో ఇది నాకు ఉత్తమ సినిమాటిక్ అనుభూతిని అందించింది అని రాజమౌళి వ్యాఖ్యానించారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని ఎవరూ మిస్ చేసుకోవద్దని ఆయన ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.