గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 12 జనవరి 2022 (20:17 IST)

సినిమా నిత్యావసర వస్తువులా మారింది - అఖండ థ్యాంక్స్ మీట్‌లో బాలకృష్ణ

Akhanda Thanks Meet
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `అఖండ`  డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.  ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై  మిర్యాల రవిందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతుండటంతో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. 
 
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేశాం. అది సీజన్ కాదు. ఎవరు ముందు వస్తే వారి వెనక వద్దామని అనుకున్నారు. అందరిలోనూ ఆ భయం ఉంది. మా నిర్మాత ధైర్యంతో రిలీజ్ చేశారు. తెలుగు ప్రేక్షకులు ఈ విజయాన్ని అందించారు. ధైర్యం చేసి రిలీజ్ చేసిన నిర్మాతకు నా అభినందనలు. ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అయింది. ఈ సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతోంది. పాకిస్థాన్‌లో సైతం మన అఖండ గురించి మాట్లాడుకుంటున్నారు. మేం అఖండ సినిమా చేసేటప్పుడు సింహ, లెజెండ్ గురించి ఆలోచించలేదు. నమ్మకంతో పని చేస్తే ఫలితం దేవుడు చూసుకుంటాడు. ఈ అఖండ ఫలితం ఆ దేవుడు ఇచ్చిందే. సినిమా ఇప్పుడు అందరికీ నిత్యావసర వస్తువులా మారింది. కొత్త సినిమాలను అందించాలనే తపన నిర్మాత, దర్శకులకు ఉండాలి. జగపతి బాబు, శ్రీకాంత్‌లకు మంచి పాత్రలు వచ్చాయి. ఈ సినిమాలో వినోదం, విజ్ఞానం రెండూ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించారు. కొత్త రకం సినిమాలను ఆదరించేవారిలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారని గర్వంగా చెబుతున్నాను. మా వెన్నుతట్టి ఇంకా మంచి సినిమాలు ఇవ్వండని ప్రేక్షకులు ప్రోత్సహించారని మేం అనుకుంటాం. చిన్నా పెద్దా అనే సినిమాలు ఉండవు. పెద్ద సినిమా పోతే.. చిన్న సినిమా అని కూడా అనరు .చిన్న సినిమా హిట్ అయితే పెద్ద సినిమా అంటారు. అన్నీ సినిమాలు ఒకటే. అందరికీ ఉపాధి దొరకాలి. 
 
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలి. మా కెమెరామెన్ రెండు పాత్రలను ఎంతో అద్బుతంగా చూపించారు. థమన్ కోసం ఇంటర్ పోల్ అధికారులు వెతుకుతున్నారు. ఆయన దెబ్బకు బాక్సులు బద్దలయ్యాయి. అద్బుతమైన సంగీతాన్ని అందించారు. మా ఫైట్ మాస్టర్లు అధ్భుతంగా కంపోజ్ చేశారు. ఎవరేం చేసినా కూడా వారందరితో చేయించింది మాత్రం బోయపాటి గారే. అందరి నుంచి నటనను రాబట్టుకునే సత్తా ఉన్న దర్శకుడు బోయపాటి గారు. ఆయన దేశం గర్వించదగ్గ దర్శకుడు. మా నిర్మాత ఎప్పుడూ అదే చిరునవ్వుతో ఉన్నారు. సినిమా ప్రారంభించినప్పుడు అలానే ఉన్నారు. సినిమా హిట్ అయినా అలానే ఉన్నారు. అలాంటి నిర్మాతలే కావాలి. ఇటువంటి సినిమాలు ఇంకా వస్తాయి. చలనచిత్ర రంగం ఉన్నంత వరకు ఇలాంటి సినిమాలు నిలిచిపోతాయి. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి’ అని అన్నారు.
 
నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా గురించి చాలా వేదికలపై మాట్లాడాను. నిన్ననే ఓ డిస్ట్రిబ్యూషన్ ఫోన్ చేశారు. బాలయ్య గారి సినిమా అంటే సంక్రాంతి వస్తుంది. ఇంకో నాలుగు రోజులు ఉంచుతారా? సర్.. యాభై రోజులు పూర్తి అవుతంది అన్నారు. గత కొన్నేళ్లుగా ఇలా డిసెంబర్‌లో విడుదలై సంక్రాంతి వరకు కొన్ని వందల థియేటర్లలో నడుస్తున్నది కేవలం అఖండ మాత్రమే. అది చాలా సంతోషంగా ఉంది. 2015లో నా జర్నీ మొదలైంది. సాహసం శ్వాసగా సాగిపో, జయ జానకీ నాయక సినిమాలు మంచివే. కానీ డిస్ట్రిబ్యూటర్లకు కాస్త ఇదైంది. సినిమాలు సరిగ్గా ఆడకపోతే మొదటగా ఇబ్బంది పడేది డిస్ట్రిబ్యూటర్లు. కానీ ఏనాడూ కూడా వాళ్లు నన్ను ఒక్క మాట అనలేదు. వారే వచ్చి నన్ను ఓదార్చేవారు. డిస్ట్రిబ్యూటర్లందరికీ మంచి విజయాన్ని ఇవ్వాలని అనుకున్నాను. అది అఖండ సినిమాతో తీరింది. ఇప్పుడు అందరూ డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా విడదలయ్యే సమయంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల పరిస్థితి ఘోరంగా ఉండేది. జనాలు వస్తారా? థియేటర్లు నిండుతాయా? అని అనుకున్నారు. ఆ సమయంలో అఖండ సినిమాను విడుదల చేశాం. డిస్ట్రిబ్యూటర్లంతా కూడా ధైర్యం చేసి విడుదలయ్యారు. ఆడియెన్స్ ఆదరించడం వల్లే ఇదంతా సాధ్యమైంది. బయటి ప్రపంచం ఎలా ఉన్నా కూడా తెలుగు సినిమాను తెలుగు ప్రేక్షకులు బతికిస్తారు. కష్టకాలంలో అఖండ విడుదలైంది. అందరూ కలిసి విజయాన్ని అందించారు. ప్రేక్షకుల ఆదరణ వల్లే మేం అంతా సంతోషంగా ఉన్నాం. ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’ అని అన్నారు.
 
స్టార్ డైరెక్టర్  బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘ఇది డబుల్ సక్సెస్ మీట్. ఈ ఈవెంట్‌కు అభిమానులకు పిలవలేదు. క్షమించండి. థర్డ్ వేవ్ ఉందని కూడా అభిమానులు ఆగరు. అందుకే వారిని పిలవలేదు. బ్లాక్ బస్టర్, హిట్, జాతర అని అంటున్నారు. అన్నింటికంటే ఇది ఎక్కువ. డబ్బు రావడం వేరు. ధైర్యం రావడం వేరు. ఈ సినిమాతో అందరికీ ధైర్యం వచ్చింది. ఈ సినిమాకు నాకు ఎవ్వరైనా దొరుకుతారు. బాలయ్య గారు నా మీద పెట్టుకున్న నమ్మకంతోనే ఈ సినిమాను చేయగలిగాను. ఈ పాత్ర గురించి చెప్పితే ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఈ రోజు సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది. ఒక హీరో సినిమా తీస్తే వారి అభిమానులు మాత్రమే సంతృప్తి చెందుతారు. కానీ అందరు హీరోల అభిమానులను ఈ సినిమా సంతృప్తి పరిచింది. ఇలాంటి చిత్రాలు రావడం చాలా అరుదు. డైరెక్టర్ బోయపాటి శ్రీను అని పిలిచేవారు. కానీ ఇప్పుడు మా డైరెక్టర్ బోయపాటి శ్రీను అని అంటున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే వస్తాను అని మీకు మాటిస్తున్నాను. ప్రతీ టెక్నీషియన్‌కి నా కృతజ్ఞతలు. నా సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్. బాలయ్య గారి నమ్మకమే అఖండ. రెండు పాత్రల మేకప్ కోసం పంజాబ్ నుంచి విధి అమ్మాయిని తీసుకొచ్చాం. ది బెస్ట్ టెక్నిషియన్స్ తీసుకొచ్చి సినిమాను తీశాను. ఇది కరోనా, థర్డ్ వేవ్ సమయం అందరూ జాగ్రత్తగా ఉండండి. సినిమాను సక్సెస్ సూపర్ సక్సెస్ అంత కంటే ఎక్కువ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు, తెలుగు సినిమా అభిమానులకు కృతజ్ఞతలు’ అని అన్నారు.
 
నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘నా గెటప్ చూసి ఇంట్లో వాళ్లు కూడా భయపడ్డారు. మేకప్‌తో ఇంటికెళ్తే.. ఎవరో వచ్చారని లేచి వెళ్లిపోయేవారు. నేను ఎన్నో పాత్రలు చేశాను. ఇప్పటి వరకు చేయని విలన్ పాత్రను చేశాను. వరదరాజులుగా ఈ పాత్రకు ఇంత పేరు రావడానికి బోయపాటి శ్రీను కారణం. ఇలా అందరూ భయపడిపోతే నాకు మళ్లీ పాత్రలు ఇవ్వరేమోననిపిస్తోంది’ అని అన్నారు.
 
అయ్యప్ప శర్మ మాట్లాడుతూ.. ‘కొన్ని సినిమాలు చేసినందుకు ఇష్టపడతాం. హ్యాపీగా ఫీలవుతాం. కానీ ఇలాంటి సినిమా చేసినప్పుడు గర్వంగా ఫీలవుతాం. కాలర్ ఎగిరేసుకుని చెప్పే సినిమా ఇది. ఈ సినిమాను మేం అంతా ఒక వైపు మోస్తుంటే.. సెకండాఫ్‌లో వచ్చి అఘోరగా అందరినీ మోసుకెళ్లిపోయారు. సినిమాను అమాంతం తీసుకెళ్లారు’ అని అన్నారు.
 
డీఓపీ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాత, బాలయ్య బాబుకు థ్యాంక్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు చిత్ర యూనిట్.