శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (12:11 IST)

ఇదంతా జ‌గ‌మేమాయ అంటోన్న గిరిబాబు

Giribabu
నటుడు గిరిబాబు నాట‌కాల నుంచి సినిమా న‌టుడిగా నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా విభిన్న‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. ఇలా నా జీవితంలో జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేదు. అందుకే నేను న‌టించిన మొద‌టి సినిమా జ‌గ‌మేమాయ. ఆ సినిమా టైటిల్ లాగే ప్ర‌తీ వ్య‌క్తి జీవితంలో ఎన్నో ఎత్తుప‌ల్లాలు సుఖ దుఃఖాలు వుంటాయ‌ని గ్ర‌హించాన‌ని ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశాడు. నేడు ఆయ‌న జ‌న్మ‌దినం. సీనియ‌ర్ న‌టులంద‌రితోనూ దాదాపు న‌టించిన ఆయ‌న ప్ర‌స్తుత‌తం వీలున్న‌ప్పుడు త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన సినిమాల‌ను చేస్తూ కాలాన్ని వెల్ల‌దీస్తున్నారు.
 
బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి న‌టుడిగా ప్ర‌వేశించిన ఆయ‌న మొద‌ట విల‌న్‌గా రేప్‌ల గిరిబాబుగా ప్ర‌సిద్ధి కెక్కారు. న‌మ్మించి మోసం చేసే పాత్ర‌ల‌కు ఆయ‌న ఫేమ‌స్ అలాంటి ఆయ‌న ఆ త‌ర్వాత ప‌లు విభిన్న‌మై పాత్ర‌లు పోషించారు. పాత్ర‌ల‌క‌నుగుణంగా నవ్వించాడు, కవ్వించాడు, ఏడ్పించాడు. విలన్ గా భయపెట్టాడు. ఆరంభంలో హీరో వేషాలు వేయాలనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆయన అసలు పేరు యెర్రా శేషగిరిరావు. ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించారు. గిరిబాబుకు ఎలాగైనా వెండితెరపై కనిపించాలనే కోరిక వుండేది. చదువుకొనే రోజుల్లోనే నాటకాలు వేస్తూ ఉండేవారు. మిత్రులు ప్రోత్సహించారు. ‘జగమేమాయ’ చిత్రంతో గిరిబాబు తెరంగేట్రం చేశారు. ఆ తరువాత అనేక చిత్రాలలో విలన్ గా నటించారు. కొన్ని సినిమాలలో కేరెక్టర్ యాక్టర్ గానూ రాణించారు.
 
న‌టుడేకాకుండా త‌న‌లో ద‌ర్శ‌కుడిని కూడా పైకి తీసుకువ‌చ్చారు. దానికోసం స్వంత నిర్మాణ సంస్థ జయభేరి పిక్చర్స్’బ్యానర్ ను స్థాపించి, ఆ పతాకంపై చంద‌న‌, ర‌ణ‌రంగం, ఇంద్ర‌జిత్‌, నీసుఖ‌మే నేను కోరుతున్నా “దేవతలారా దీవించండి, సింహగర్జన, మెరుపుదాడి, పసుపు-కుంకుమ” వంటి చిత్రాలను నిర్మించారు అందులో ‘రణరంగం, నీ సుఖమే నే కోరుతున్నా’ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. తన చిన్నకొడుకు బోసుబాబును హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో ‘ఇంద్రజిత్’ తెరకెక్కించారు. ఇక రెండో కుమారుడు ర‌ఘుబాబు గురించి తెలిసిందే. ఆయ‌న విభిన్న‌మైన కామెడీ, కేరెక్ట‌ర్ ఆర్టిస్టు. గిరిబాబు ఇటీవ‌లే శ్రీ‌నివాస క‌ళ్యాణం, గీత గోవిందం, జాతిర‌త్నాలు, సీతా క‌ళ్యాణం వంటి చిత్రాల‌లో న‌టించారు. ముందుముందుకూడా తాను సినిమాల్లో న‌టిస్తాన‌ని విశ్వాసాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న‌కు ఇవే పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు.