ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (17:21 IST)

లాంఛనంగా ప్రారంభమైన గోపీచంద్ 30వ సినిమా

Gopichand 30th movie opening
హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌లది టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్  హిట్లను అందించారు. ఇప్పుడు మూడో సారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతోన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం వరుసగా సినిమాలు నిర్మిస్తోంది. ఆ బ్యానర్‌లో ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా మారనుంది.
 
గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌ను నేడు లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌కు వివి వినాయక్ క్లాప్ కొట్టగా.. టీజీ వెంకటేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి సన్నివేశానికి దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు గౌరవప్రదంగా దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారు.
 
శ్రీవాస్ మాట్లాడుతూ.. ‘లక్ష్యం, లౌక్యం తరువాత మళ్లీ ఇలా హ్యాట్రిక్ కోసం కలవడం హ్యాపీగా ఉంది. మా మైండ్ సెట్ బాగా సింక్ అవ్వడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్లే ఆ సక్సెస్ వచ్చింది. ఈ సినిమాకు కూడా మంచి కథ కుదిరింది. గురు సమానులైన రాఘవేంద్ర రావు గారు వచ్చి ఫస్ట్ సీన్‌కు డైరెక్ట్ చేయడం ఆనందంగా ఉంది. వినాయక్ వచ్చి క్లాప్ కొట్టడం, టీజీ వెంకటేష్ గారు కెమెరా స్విచ్చాన్ చేయడం హ్యాపీగా ఉంది. ఇలా అందరి మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వరుసగా చేస్తోన్న మా ఈ చిత్రం ఎంతో ప్రత్యేకంగా మారుతుంది. గోపీచంద్ గారి కెరీర్‌లో 30వ సినిమా అవ్వడంతో మరింత జాగ్రత్తలు తీసుకున్నాం. భూపతి రాజా గారు అందించిన కథ మీద చాలా వర్క్ చేశాం. అందరూ హ్యాట్రిక్ అని అనేవారు. అది బాధ్యతలా మారింది. ఆ రెండు సినిమాలను మించేలా ఇది ఉండబోతోంది. కెమెరామెన్ వెట్రితో లౌక్యం సినిమాను చేశాను. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంటుంది. పండుగ తరువాత మా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తామ’ని అన్నారు.
 
నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల మాట్లాడుతూ..‘హ్యాట్రిక్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నామ’ని  అన్నారు.
 
రైటర్ భూపతి రాజా మాట్లాడుతూ.. ‘గోపీచంద్ గారి 30వ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. శ్రీవాస్ గారి వల్లే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా ఉంటుంది’ అని అన్నారు.
 
కెమెరామెన్ వెట్రి మాట్లాడుతూ.. ‘నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు అవకాశాలు ఇచ్చాడు. నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం. లౌక్యం తరువాత మళ్లీ శ్రీవాస్ గారితో పని చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
గోపీచంద్ మాట్లాడుతూ.. ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో మా హ్యాట్రిక్ సినిమా రాబోతోండటం సంతోషంగా ఉంది. 2007లో లక్ష్యం, ఆ తరువాత ఏడేళ్లకు లౌక్యం. మళ్లీ ఏడేళ్లకు మరో సినిమా చేస్తున్నాం. భూపతి రాజా గారు మంచి కథను అందించారు. వెట్రి గారితో కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాను. దాదాపు ఐదు చిత్రాలు ఆయనతో చేశాను. ఆయనతో చేసినప్పుడు పాజిటివ్ వైబ్ ఉంటుంది. మంచి కథకు మంచి ఆర్టిస్ట్‌లు దొరికారు. మంచి టీంతో ముందుకు వెళ్తే ఫలితం కూడా అంతే బాగా వస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.
 
వెట్రి పళనిస్వామి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. భూపతి రాజా కథను అందించగా.. వెలిగొండ శ్రీనివాస్ మాటలు రాశారు.
 
ఈ హ్యాట్రిక్ ప్రాజెక్ట్ మీదున్న అంచనాలకు తగ్గట్టుగా శ్రీవాస్ అదిరిపోయే స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. గోపీచంద్ కూడా ఈ మూవీ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో సరికొత్త గోపీచంద్‌ను చూడబోతోన్నాం.
 
లక్ష్యం, లౌక్యం వంటి ఫ్యామిలీ, హిలేరియస్ ఎంటర్టైనర్‌గా ఈ మూడో ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతోన్న ఈ మూవీ టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదు.
 
వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ తరువాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.