ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 జనవరి 2017 (17:57 IST)

అన్న చిరంజీవి, తమ్ముడు పవన్‌ను ఎవరైనా ఏమన్నా అంటే?: నాగబాబు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఖైదీ నెంబర్ 150 ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో వర్మపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు వర్మ వరుస ట్వీ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఖైదీ నెంబర్ 150 ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో వర్మపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు వర్మ వరుస ట్వీట్లతో నాగబాబుపై విరుచుకుపడ్డారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. తాను ఆరోజు కావాలనే మాట్లాడినట్టు తెలిపారు.

తమ మీద పలువురు రాళ్లు వేసినప్పుడు తాము కూడా ఒక రాయి వేయాలని లేకపోతే అది తప్పు అవుతుందన్నారు. అన్న చిరంజీవి, తమ్ముడు పవన్‌ను ఎవరైనా అంటే తాను ఇలానే స్పందిస్తానని తెలిపారు. వర్మ చాలా గొప్ప దర్శకులని, తెలుగువారి సత్తాను ముంబైలో చాటిచెప్పి, ఉత్తర భారతీయులకు ఒక గొప్ప పాఠం నేర్పాడని అన్నారు.
 
అయితే గత ఐదారేళ్ల నుంచి ఆయన మెగా ఫ్యామిలీపై విమర్శలు చేశారన్నారు. గబ్బర్ సింగ్ కాస్త బెగ్గర్ సింగ్ అయిందని అనడం తప్పన్నారు. చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ ఈ గెటప్‌ను జేమ్స్ కామరూన్ చూస్తే ఆశ్చర్యపోతాడని వెటకారం చేయడం సబబు కాదన్నారు. తమ ముగ్గురు అన్నదమ్ముల్లో వర్మ గారిని ఎవరూ, ఎప్పుడూ ఏమీ అనలేదని నాగబాబు వెల్లడించారు. తన అన్న చిరంజీవిని ఏమైనా అంటే తాను బ్యాలెన్స్ కోల్పోతానని, అది తన వీక్ పాయింట్ అని నాగబాబు చెప్పుకొచ్చారు. 
 
మెగా అభిమానులు రాజకీయాల పరంగా చిరంజీవిని వ్యతిరేకించి ఉండవచ్చు, కాని సినిమా పరంగా ఆయనవైపే ఉన్నారని ఖైదీ నెం. 150 నిరూపించిందని అన్నారు. సినిమాలో కూడా రాజకీయాలకు సంబంధించి ఏ అంశం కూడా ఖైదీ నెం.150లో చూపించలేదని చెప్పుకొచ్చారు. చిరంజీవి అందరివాడని, సినిమాను కూడా అందరూ ఆదరించారని అన్నారు. రాజకాయాల్లోకి వెళితే కొందరివాడవుతాడని తాను అప్పుడు అన్నట్లు గుర్తు చేశారు. కాని సినిమాల్లో ఆయన అందరివాడని, తెలుగు ఇండస్ట్రీ కింగ్ చిరంజీవీయేనని అన్నారు.