తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి
తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలివేస్తానని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత అలియాస్ అయేషా పేర్కొన్నారు. పైగా తన భర్త జానీ మాస్టర్ ప్రతిభను ప్రోత్సహించేవారని, ఎవరికైనా అవకాశాల్లేకుండా ఆయనెందుకు చేస్తారని సుమలత అలియాస్ ఆయేషా పేర్కొన్నారు. ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమె నిజం నిరూపిస్తే భర్తను వదిలేస్తానని ఆయేషా అన్నారు.
లైంగికవేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ, 'కొరియోగ్రాఫర్‌గా అగ్ర స్థానంలో ఉండాలి లేదా హీరోయిన్‌గా స్థిరపడాలనేది ఆ అమ్మాయి, ఆమె తల్లి కోరిక. స్టేజ్ షోల నుంచి వచ్చిన ఆమె సినీ రంగాన్ని చూసి ఆ లగ్జరీ లైఫ్ కావాలని కోరుకునేది. తనకెక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని చూస్తుంటుంది.
మైనర్‌గా ఉన్నప్పుడు ఘటన జరిగిందనడానికి సాక్ష్యమేంటి? జానీ మాస్టర్‌తో సాన్నిహిత్యంగా ఉందని ఎవరైనా చూశారా? ఇప్పటివరకూ ఆ అమ్మాయి బయటకొచ్చి మాట్లాడిందా? అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు మాట్లాడటానికి ఏమైంది? ఒకవేళ లైంగిక వేధింపులకు గురైతే.. 'జానీ మాస్టర్ వద్ద పని చేయడం నా అదృష్టం' అని నవ్వుతూ ఎందుకు చెబుతుంది. ఆ మాట చెప్పినప్పుడు ఆమె ఇబ్బంది పడినట్టు కనిపించలేదు. హైదరాబాద్‌లో.. అసోషియేషన్ కార్డు పొందేందుకు ఆమె దగ్గర డబ్బులేకపోతే.. మాస్టర్ ముంబైలో ఇప్పించారు. తాను పని చేసిన సినిమాలో కొరియోగ్రాఫర్‌గా అవకాశం కూడా ఇచ్చారు' అని అన్నారు.