భాగ్యనగరితో అమ్మ అనుబంధం... శ్రీనగర్ కాలనీలో జయలలితకు ఇల్లు.. రాధికా కాలనీలో శశికళ పేరుతో
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు హైదరాబాద్ నగరంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. హైదరాబాద్ నగరంలో రెండు గృహాలతో పాటు.. 25 ఎకరాల విస్తీర్ణంలో జేజే గ్రీన్ గార్డెన్ కూడా ఉంది. జయలలిత ఎవర్ గ్రీన్ హీరోయిన్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు హైదరాబాద్ నగరంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. హైదరాబాద్ నగరంలో రెండు గృహాలతో పాటు.. 25 ఎకరాల విస్తీర్ణంలో జేజే గ్రీన్ గార్డెన్ కూడా ఉంది. జయలలిత ఎవర్ గ్రీన్ హీరోయిన్‌గా ఉన్న సమయంలో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ ఇంట్లో నివశించే వారు. రాధికా కాలనీలోని ఇంటికి అపుడప్పుడూ వెళ్తుండేవారు. ముఖ్యంగా రాధికా కాలనీలోని ఇల్లు ఇప్పటికీ శశికళ పేరుతో ఉండటం గమనార్హం. దీంతో జయలలిత మరణ వార్త విని ఈ కాలనీ వాసులంతా హతాశులయ్యారు. 'అమ్మ' లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ 'అమ్మ'ను చివరిసారి కళ్లారా చూసుకునేందుకు అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకూ టీవీ లకు అతుక్కుపోయామని చెపుతున్నారు.
ముఖ్యంగా సినిమా వాళ్ళకు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీతో ప్రత్యేక అనుబంధం ఉంది. అలాంటి వారిలో జయలలిత కూడా ఒకరు. ఇక్కడ 1970లో శ్రీనగర్ కాలనీలో ప్లాట్ కొనుగోలు చేసి అందమైన భవంతి (ఇంటి నెంబర్ 8-3-1099)ని నిర్మించుకున్నారు. ఆ సమయంలో ఆమె తెలుగు, తమిళ భాషల్లో పెద్ద నటీమణిగా వెలుగొందుతున్నారు. ఇక్కడ షూటింగ్‌లు ఉన్నప్పుడు తప్పనిసరిగా శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలోనే ఉండేవారు.
ఉదయం వేళ వాకింగ్ కూడా చేసేవారని ఆమెతో పరిచయం ఉన్న పలువురు స్థానికులు గుర్తు చేసుకున్నారు. అయిదారేళ్లు ఆమె ఈ నివాసాన్ని వినియోగించుకున్నారని అనంతరం తమిళనాడులో స్థిరపడటంతో తరచూ వచ్చి వెళ్తుండేవారని పేర్కొన్నారు. ఆమె ఇక్కడున్న సమయంలో పలువురు అగ్రనిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా వచ్చేవారని స్థానికులు చెప్పారు. రెండు, మూడు సార్లు సూర్యకాంతంను కూడా ఆమె ఇంట్లో చూశానని ఓ మహిళ పేర్కొంది.
సినిమా వాళ్ల రాకపోకలతో ఈ వీధికి జయలలిత వీధిగా అప్పట్లోనే పేరొచ్చిందన్నారు. మరోవైపు జయలలిత పేరు మీదనే జీహెచ్‌ఎంసీలో ఆస్తిపన్ను చెల్లిస్తున్నారు. కరెంట్ బిల్లు, వాటర్‌బిల్లు అన్నీ జయలలిత పేరుమీదనే ఉన్నాయి. అంతేకాదు 1970లోనే ఆమె టెలిఫోన్ కనెక్షన్ కూడా తీసుకున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. అనంతరం ఫోన్ డిస్‌కనెక్ట్ కావడం 1978లో ఈ ఇంటిని అద్దెకు ఇవ్వడం జరిగిందని స్థానికులు చెప్పారు. గత కొన్నేళ్ల నుంచి ఈ ఇల్లు ప్రముఖ డిస్టిలరీస్ సంస్థ యునైటెడ్ బేవరేజస్‌కు అద్దెకిచ్చారు. అద్దె డబ్బులు నేరుగా జయలలిత బ్యాంక్ ఖాతాలోకి వెళ్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ బిల్డింగ్ నిర్వహణ మొత్తం ఓ మేనేజర్‌కు అప్పగించారు.
అదేవిధంగా వెస్ట్‌మారేడ్‌పల్లిలోని రాధిక కాలనీలోనూ ఆమె ఇష్టసఖి శశికళ పేరుతో ఓ ఇల్లు ఉంది. 2001లో జయలలిత ఈ ఇంటికి వచ్చారు. దీంతో కాలనీవాసులు ఆమెను కలసి అభినందనలు తెలిపారు. ఆమె మరణ వార్త విని కాలనీవాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమెతో జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. కాగా ఈ ఇల్లు రెండేళ్లుగా ఖాళీగా ఉంటోంది. అలాగే. 25 ఎకరాల విస్తీర్ణంలో జేజే గ్రీన్ గార్డెన్ ఉంది. ప్రస్తుతం ఈ గార్డెన్‌ను హైదరాబాద్‌కు చెందిన ఓ రైతు లీజుకు తీసుకున్నారు. ఎకరాకు రూ.25 వేల చొప్పున చెల్లిస్తూ.. ఈ గార్డెన్‌లో కూరగాయలు పండిస్తున్నారు.