బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 10 మార్చి 2020 (22:00 IST)

ఉప్పెన మూవీకి - సీతాకోక చిలకకి సంబంధం ఏంటి?

మెగాస్టార్ మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ఉప్పెన. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని నీ కన్ను నీలి సముద్రం... అంటూ సాగే పాటను ఇటీవల బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ లాంచ్ చేశారు. శ్రీమణి రాసిన ఈ పాటను జావెద్ అలీ ఆలపించారు. ఈ పాట విన్న వెంటనే నచ్చేస్తుంది. మళ్లీ మళ్లీ వినాలి అనిపించేలా ఉండడంతో యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళుతుంది.
 
ఇదివరకు విడుదల చేసిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్లకు అనూహ్య స్పందన లభించింది. అలాగే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్న తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ పోస్టర్ కు కూడా మంచి స్పందన లభించింది. ఇప్పుడు నీ కన్ను నీలి సముద్రం అంటూ సాగే పాట విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇలా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్‌కు పాజిటివ్‌గా స్పందన రావడంతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. వైష్టవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తుంటే.. బ్రహ్మాజీ, సాయిచంద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ సినిమాలోని పాట చాలా బాగుంది అంటూ సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాకుండా... సినీ ప్రముఖులు సైతం అభినందిస్తుండడం విశేషం. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ ఈ పాట గురించి స్పందిస్తూ... ఈ వేసవికి ఇంత కంటే చల్లనైన, చక్కనైన సినిమా రాదనేది నా ప్రగాఢ నమ్మకం. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ కథ ఫస్టాఫ్ ఒకసారి, సెకండాఫ్ ఒకసారి చెప్పాడు. అతను కథ చెప్పిన విధానం, ఆ డీటైలింగ్ చూసి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అప్పుడే తెలిసింది. ప్రతి ఫ్రేంను డైరెక్టర్ బుచ్చిబాబు ముందే చూశాడు. నాకు తెలిసి ఇంత చక్కని విలేజ్ లవ్ స్టోరీ ఈ మధ్య కాలంలో రాలేదు అన్నారు.
 
తనని బాగా ఇన్ స్పైర్ చేసిన సినిమా సీతాకోకచిలక. అది నా చిన్నతనంలో వచ్చింది. నిజాయితీగా చెబుతున్నా... అలాంటి ఫీల్ ఉన్న సినిమా ఉప్పెన అని నేను నమ్ముతున్నాను అని కొరటాల చెప్పడంతో ఈ సినిమా పై అంచనాలను పెంచేసారని చెప్పచ్చు. ఈ సినిమాలో నీ కన్ను నీలి సముద్రం సాంగ్ చాలా బాగుంది.

దేవి శ్రీప్రసాద్ సంగీతం గురించి చెప్పాల్సింది ఏముంటుంది... కథకు దేవి మ్యూజిక్ తోడైతే సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోయింది. వైష్ణవ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ వండర్ ఫుల్. చాలా చార్మింగ్ గా ఉన్నాడు. అతను స్క్రీన్ మీద కనిపిస్తుంటే, పక్కన అందమైన హీరోయిన్ ఉన్నా సరే, కళ్లు అతని వైపే ఉంటున్నాయి. వైష్ణవ్ కు ఇంత కంటే బెటర్ డెబ్యూ రాదనుకుంటున్నా. అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను అన్నారు.
 
ఒక్క కొరటాల శివ మాత్రమే కాదు... ఉప్పెన సినిమా కథ తెలిసిన వాళ్లందరూ చెబుతున్న మాట ఒక్కటే.. ఈ సినిమా రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే... చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ తో ఉప్పెన సినిమా గురించి మెగా అభిమానులు మాత్రమే కాకుండా.. ఫిల్మ్ మేకర్స్ కూడా ఎంతో ఆసక్తితో ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు. మరి... ఉప్పెన ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.