గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 14 మే 2019 (18:54 IST)

అచ్చొచ్చిన థియేటర్‌లో "మహర్షి" సందడి (video)

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నటించిన తాజా చిత్రం "మ‌హర్షి". ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఈ గ్రాస్ కలెక్షన్లను చూసి చిత్ర పరిశ్రమలోని పెద్దలు విస్మయానికి లోనయ్యారు. 
 
అదేసమయంలో త‌న సినిమాని జ‌నాల‌లోకి మ‌రింత‌గా తీసుకెళ్ళేందుకు మ‌హేష్ బాబు నడుంబిగించారు. ప‌లు ఈవెంట్స్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్న‌ మ‌హేష్ బుధవారం సాయంత్రం 6 గంట‌ల‌కి హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌‌లోని సుద‌ర్శ‌న్ 35ఎంఎం థియేట‌ర్‌లో జ‌ర‌గ‌నున్న సక్సెస్ సెలబ్రేషన్‌లో పాల్గొనున్నాడు. ఇందుకోసం థియేటర్ యాజమాన్యం కూడా భారీ ఏర్పాట్లు చేస్తోంది. 
 
గతంలో మహేష్ నటించిన "మురారీ, ఒక్కడ, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" వంటి చిత్రాలు ఈ థియేటర్‌లో ప్రదర్శించారు. ఇపుడు మహర్షి కూడా సూపర్ హిట్ కొట్టడంతో ఈ చిత్రాన్ని మరింతగా ప్రమోషన్ కల్పించాలన్న ఉద్దేశ్యంతో మహేష్ ఈ థియేటర్‌కు వస్తున్నారు. 
 
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షి చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేష్ కీలక పాత్రను పోషించాడు. ఈ చిత్రం కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికీ నచ్చడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూకట్టారు. ఫలితంగానే నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లో సైతం ఒక్క మిలియన్‌ డాలర్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, మహేష్ బాబు చిత్రాల్లో మొదటి వరుసలో నిలిచింది. 
 
ఇదిలావుంటే, అమ్మాయిల క‌లల రాకుమారుడు మ‌హేష్ బాబు క్యూట్ స్మైల్‌కి ఫిదా కానివారు లేరు. చిన్న చిరున‌వ్వుతో అమ్మాయిల గుండెల్లో బాణాలు దింపే మ‌హేష్ తాజాగా త‌న భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌, ఆమె సోద‌రి శిల్పా శిరోద్క‌ర్‌తో క‌లిసి న‌వ్వులు చిందించాడు. ఈ ఫోటో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
మ‌హ‌ర్షి సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా మ‌హేష్‌, న‌మ్ర‌తా, శిల్పా ఈ పిక్ దిగిన‌ట్టు తెలుస్తుంది. న‌మ్ర‌త త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోకి భారీ రెస్పాన్స్ వ‌స్తుంది. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి స‌క్సెస్ సెల‌బ్రేష‌న్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు.