సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (16:18 IST)

కైకాల సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

kaiklaa photos
kaiklaa photos
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ నటులు శ్రీ కైకాల సత్యనారాయణ గారు తుదిశ్వాస విడిచారనే విషయం తెలిసి ఆవేదనకు లోనయ్యాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మా కుటుంబానికి శ్రీ సత్యనారాయణ గారు సన్నిహితులు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి అన్నయ్య చిరంజీవి గారితోను, మాతోనూ ఆప్యాయంగా ఉండేవారు. ఇటీవల ఆయనతో మాట్లాడాను. వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకున్నాను.
 
శ్రీ సత్యనారాయణ గారిని అభిమానులు నవరస నటనా సార్వభౌమ అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతినాయక పాత్రలను ఎంత అవలీలగా పోషించారో అదే స్థాయిలో కరుణరస ప్రధానమైన పాత్రల్లోనూ ఒదిగిపోయారు. పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు. తెలుగువారికి యమధర్మరాజు అంటే శ్రీ సత్యనారాయణ గారే. ఆ పాత్రలో మరొకరిని ఊహించలేని విధంగా  చేశారు. ఏ తరహా పాత్రనైనా ప్రేక్షకుల మెప్పు పొందేలా నటించారు. నిర్మాతగాను మంచి చిత్రాలు అందించారు. లోక్ సభ సభ్యుడిగా ప్రజా జీవితంలో ఉన్నారు. తెలుగుదనం మూర్తీభవించిన శ్రీ సత్యనారాయణ గారు లేని లోటు తెలుగు చిత్రసీమలో తీర్చలేనిది. శ్రీ కైకాల సత్యనారాయణ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
  (పవన్ కళ్యాణ్)