శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 14 జులై 2021 (12:05 IST)

చాలామందికి ఆ లాజిక్ తెలీదుః త‌నికెళ్ళ భ‌ర‌ణి

Tanikella Bharani
(జూలై 14న తనికెళ్ళ భరణి పుట్టినరోజు)
నాట‌కాలు, ర‌చ‌న‌, సినిమా వేషాలు, ఆద్మాతికం వంటి రంగాల‌లో ప్ర‌వేశం వున్న వ్య‌క్తి త‌నికెళ్ళ భ‌ర‌ణి. నేడు ఆయ‌న జ‌న్మ‌దినం. భరణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురం. 1954లో జ‌న్మించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్పిన విశేషాలు. ఆయ‌న గురించి కొన్ని విష‌యాలు మీకోసం. బాల్యం నుంచీ మాతృభాష తెలుగుపైనే భరణికి మమకారం ఎక్కువ‌. చదువుకొనే రోజుల్లోనే హిందీ, ఆంగ్ల భాషల్లోనూ పట్టు సాధించారు. దొరికిందల్లా చదివారు. ఊహకొచ్చిందల్లా రాసేశారు.

అలా బి.కామ్ చ‌దువుతుండ‌గా కాలేజీలో నాట‌కాలు వేయ‌మంటే ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన నాట‌కాలు బాగాలేద‌నీ, త‌నే ఆలోచించి ఓ క‌థ రాశారు. అది ప్ర‌ద‌ర్శిస్తే బెస్ట్ ఫ్రైజ్ వ‌చ్చింది. దాంతో మ‌న‌లో ఇంత టాలెంట్ వుందా! అన్న ఆలోచ‌న వ‌చ్చింది. ఆ నాట‌కం రాళ్ళ‌ప‌ల్లిగారు చూడ‌డం ఆయ‌న ప‌రిచ‌యం జ‌రిగింది. ఆ త‌ర్వాత ఆయ‌న ప‌రిచ‌య‌మే సినిమాకు ద‌గ్గ‌ర చేసింది. `శివ‌` వంటి సినిమాను తెర‌కెక్కించేలా చేసింది. అలా ఆయ‌న ఒక్కోరంగంలో ఎదుగుతూ ఇప్పుడు మ‌రో రంగం ఆథ్మాతికంవైపు కూడా ఓ క‌న్నేశారు. 40 ఏళ్ళ సీనికెరీర్‌, 15ఏళ్ళ‌కుపైగా నాట‌క‌రంగం, 700 పై చిలుకు సినిమాల న‌ట‌న‌, 50కి పైగా క‌థ‌రాచ‌న‌లు చేసిన భ‌ర‌ణిగారి జీవితంలో ఆస‌క్తిక‌ర‌మైన విశేషాలు.
 
మ‌నిషి నైజం అదే
మ‌నిషి నైజం చిత్రంగా వుంటుంది. మ‌నం ఇడ్లీ తింటుంటాం. ఎదుటివాడు వ‌డ తింటుంటాడు. అది చూసి, అరె! అది బాగుందేమో. మ‌నం కూడా అది చెప్పివుంటే బాగుండేదిక‌దా! అనిపిస్తుంది. ఇదే అభిప్రాయం న‌న్ను చూసే అత‌నికి క‌లుగుతుంది. అందుకే నేను ఇడ్లీ, వ‌డ రెండూ తింటాను. సినిమారంగంలోకానీ ఏ రంగంలోనైనా కానీ ప‌క్క‌వాడు మ‌న‌కు తేలిగ్గా అనిపిస్తాడు. అత‌ను చేయ‌లేని పాత్ర నేను చేస్తే ఎలా వుంటుంది అనేలా మ‌న‌కు అనిపిస్తుంది. ఇక నాట‌ర‌కంగంలో మా గురువుగారు రాళ్ళ‌పల్లిగారు.
 
అందులో వంద‌రూపాయ‌లు వుండేవి
సినిమారంగంలో ఎద‌గ‌డం అంత ఈజీకాదు. చాలామంది క‌ష్ట‌ప‌డి పైకి వ‌స్తారు. కొంద‌రు గోల్డెన్ స్పూన్‌తో వ‌స్తారు. మ‌ద‌రాసు పాండీ బ‌జార్‌లో నీళ్ళు తాగి బ‌తికాం అంటారు. నేను మ‌ధ్య‌త‌ర‌గ‌తివాడిని. మా గురువుగారు వ‌ల్లే నేను మ‌ద‌రాసు వెళ్ళాను. ఆయ‌న న‌న్ను కొడులా చూశారు. అప్ప‌ట్లో నిరుద్యోగిని. ఉద‌యం 7గంట‌ల‌కు ఆయ‌నే న‌న్ను నిద్ర‌లేపేవారు. నేను అమ్మ‌గారు పెట్టింది తిన‌డం, నిద్ర‌పోవ‌డం, పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, టీవీలో సినిమాలు చూడ‌డం ఇదే ప‌ని. బ‌య‌ట‌కు వెళ్ళాల‌ని ష్యాంట్ వేసుకుంటే అందులో వంద‌రూపాయ‌లు వుండేవి. అలా గురువుగారు నాకు తెలీకుండా డ‌బ్బులు పెట్టేవారు. అందుకే నాకు ఆర్థిక బాధ‌లు పెద్ద‌గా తెలీవు. మా గురువుగారితో నాట‌కాలు ఆడేవాడిని. సుర‌భి నాట‌కాల‌ల్లో కూడా నేను ఆడాను. 
 
తొలిసినిమాలోనే రెండు వేషాలు వేశా
అలాంటి ఆయ‌న న‌న్ను వంశీగారికి ప‌రిచ‌యం చేయ‌డం జ‌రిగింది. అలా `లేడీస్ టైల‌ర్‌` సినిమాతో నా కెరీర్ మారిపోయింది. ఆ త‌ర్వాత రామ్‌గోపాల్ వ‌ర్మ `శివ‌`కు ర‌చ‌యిత‌గా న‌టుడిగా ప‌నిచేశాను. ఆ సినిమా ట్రెండ్ సెట్ అయింది. ఆ త‌ర్వాత ఆ సినిమాకు బాగా రాశాడ‌ని నాకు అవ‌కాశాలు వ‌చ్చాయి. ఏడాదికి 12 సినిమాలుకు ప‌నిచేసేవాడిని. అయితే అన్నీ ఆడ‌లేదు. దానికి కార‌ణం అన్నీ శివ‌లాగా తీయ‌లేరు. శివ సినిమా కూడా తీశాడు కాబ‌ట్టి ఆడింది. రాశానుకాబ‌ట్టి ఆడ‌లేదు. ఈ లాజిక్ చాలామందికి తెలీదు. చిత్రం ఏమంటే నేను సుమ‌న్ న‌టించిన `కంచువ‌చం` సినిమాకు మొద‌ట‌గా ప‌నిచేశాను. ఆ సినిమాలో రెండు పాత్ర‌లు వేయాల్సివ‌చ్చింది. ఆప‌ద్ధ‌ర్మంగా ముస‌లివాడి పాత్ర‌, ఆ త‌ర్వాత మ‌రో పాత్ర వేశాను. ఇలా ఏదీ నేను అనుకున్న‌ట్లు జ‌ర‌గ‌లేదు. అలా జీవితంలో జ‌రిగిపోతుంటాయి. మనం అంగీక‌రించాల్సిందే.  
 
మన‌మంతా ఆటబొమ్మలమే!
అలా వ‌చ్చిందే “ఆట కదరా శివా… ఆట కద కేశవా…” పాట‌.  ‘భూగోళమంతా ఓ నాటకరంగం… మనమంతా పాత్రధారులం’ అన్నారు శాస్త్రకారులు. నిజమే! మనమంతా కనిపించని శక్తి చేతిలో ఆటబొమ్మలం. ఆ ఆట ఆడించేవాడు శివుడు అంటారు. నేను శివ భ‌క్తుడిని. ఆ క్ర‌మంలోనే నేను మెగా ఫోన్ కూడా ప‌ట్టాల్సివ‌చ్చింది. “సిరా, కీ, బ్లూ క్రాస్, ద లాస్ట్ ఫార్మర్” వంటి లఘు చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఆ స్పూర్తితోనే బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం వంటి మ‌హానుభావుడితో ‘మిథునం’ కథా చిత్రాన్ని తెరకెక్కించా.
 
ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌దాం
ఇక మ‌నిషిగా మ‌న‌మంతా జీవులమే. ఈ చెట్టు, పుట్ట‌, చీమ‌, పాము అన్నీ ఎలాగూ మ‌న‌మూ అంతే. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోలేక‌పోతే ఎంతో న‌ష్ట‌పోతాం. మ‌నిషి మ‌నుగ‌డే వ్య‌ర్థ‌మ‌వుతుంది. ఇందుకు నిద‌ర్శ‌న‌మే క‌రోనా కాలంలో ఆక్సిజ‌న్ కొర‌త‌. ఉప‌ద్ర‌వాలు, భూకంపాలు రావ‌డం. మ‌నం న‌లుగురికి మంచి క‌లిగే ప‌నులు చేస్తే ప్ర‌కృతిఏ మ‌న‌ల్ని కాపాడుతుంది. అంటూ స‌త్యాన్ని మ‌రోసారి గుర్తు చేస్తున్నారు.