1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 మే 2024 (17:40 IST)

31 సినిమా లవర్స్ డే : బంపర్ ఆఫర్ ప్రకటించిన మల్టీప్లెక్స్ అసోసియేషన్!!

theaters
ఈ నెల 31వ తేదీన సినిమా లవర్స్ డే జరుపుకుంటారు. ఆ రోజున సినిమా ప్రేక్షకుల కోసం మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మూవీ లవర్స్ డే సందర్భంగా ఏ భాషా సినిమా అయినా, ఏ షో అయినా రూ.99కే టిక్కెట్‌ను విక్రయించనున్నారు. పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్ వలాంటి చైన్లతో పాటు దేశంలో ఉన్న నాలుగు వేలకు పైగా స్క్రీన్‌లో రూ.99కే టిక్కెట్‌ను విక్రయించనున్నారు. ప్రేక్షకులను మళ్లీ థియేటర్లవైపు రప్పించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
 
దేశవ్యాప్తంగా ఓవైపు ఎన్నికల హడావిడి, మరోవైపు ఐపీఎల్ ఫీవర్ కారణంగా ఈ వేసవిలో టాలీవుడ్, బాలీవుడ్ సహా ఎక్కడా పెద్ద హీరోల సినిమాలేవీ విడుదల కాలేదు. విడుదలైన చిన్న సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. హాలీవుడ్ సినిమాలు కూడా పరిమితంగానే విడుదలయ్యాయి. దీంతో థియేటర్ ఆక్యుపెన్సీ రేషియో దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ టికెట్లపై డిస్కౌంట్ ప్రకటించింది. 
 
బుక్ మైషో, పేటీఎం, అమెజాన్ పేలాంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా ఈ నెల 31వ తేదీన సినిమా టికెట్లు బుక్ చేసుకొనేవారు రూ.99తోపాటు జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ నేరుగా థియేటర్‌లోని కౌంటర్‌లో టికెట్ కొంటే మాత్రం జీఎస్టీ, ఇతర చార్జీలు ఉండవు. అయితే ఐమ్యాక్స్, రిక్లైనర్ సీట్లకు మాత్రం రూ.99 టికెట్ ధర వర్తించదు.