ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2023 (12:05 IST)

స్మగ్లర్, గ్యాంగ్ స్టర్ వంటి నేర చరితులకు జాతీయ పురస్కారాలా!

nayagan- puspha
nayagan- puspha
రెండు రోజుల నాడు అంటే సప్తమి నాడు  చంద్ర యాన్ 3 చంద్రునిపై ల్యాండ్ అయింది. దాన్ని దేశమంతా ఆనందంతో శుభాకాంక్షలు  అటు ఇస్రో వారికి, ఇటు మోడీకి చెప్పారు. వెంటనే దాన్ని మరిచేలా దేశమంతా 69వ జాతీయ సినిమా అవార్డులు 24న అష్టమి నాడు  ప్రకటించి బ్రేక్ చేశారు. దేశమంతా హీరోలకు, సినిమా దర్శక నిర్మాతలకు, హీరోయిన్ కు, సాంకేతిక సిబ్బందికి ప్రశంసలు వెల్లువలు వచ్చి పడ్డాయి. అన్ని భాషల సినిమాలకు న్యాయమ్ జరిగింది.

ganghubhai
ganghubhai
కానీ ఎంపిక తీరు కొంత విమర్శలకు దారితీసింది. ఆర్.ఆర్.ఆర్. లో ఉత్తమ నటుడు గా రామ్ చరణ్ కు ఆస్కార్ రావడం జరిగింది. కానీ ఆయనికి  ఈసారి జాతీయ అవార్డు ఇవ్వలేదు. ఎలాగో పెద్ద అవార్డు వచ్చింది అనుకున్నారేమో. కానీ ఇప్పడు ఉత్తమ నటుడు, నటి అవార్డు ఇవ్వడం పట్ల కొందరు బాణాలు సంధించారు. నేర చరితులకు జాతీయ పురస్కారాలా! అంటూ కోమెంట్ చేస్తున్నారు. 
 
komaram bheem
komaram bheem
సోషల్ మీడియాలో విశీ (వి.సాయివంశీ) అనే విశ్లేషకుడు ఇలా తెలియజేస్తున్నాడు.  తమిళనాడు నుంచి ముంబయి వెళ్లి, పోర్టర్‌గా జీవితం ప్రారంభించి అండర్ వరల్డ్ డాన్‌గా ఎదిగిన ఒకాయన ఉన్నారు. ఆయన పేరు వరదరాజన్ ముదలయార్. ఆయన జీవితం ఆధారంగా దర్శకుడు మణిరత్నం 1987లో 'నాయగన్' అనే తమిళ సినిమా తీశారు. అందులో కమల్‌హాసన్ ప్రధాన పాత్ర పోషించారు. అంతకుముందు ఏడాది 'స్వాతిముత్యం'లో అమాయకుడి పాత్ర, అంతకు ఇంకా ముందు 'సాగరసంగమం'లో డ్యాన్సర్ పాత్ర పోషించిన కమల్‌హాసన్ ఈ డాన్ పాత్ర చేయడానికి ఏమాత్రం సందేహించలేదు. అద్భుతంగా నటించారు. మెప్పించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి పురస్కారం ఆయన్ను అవార్డు వరించింది.
 
"సాహిత్యం ఆధారంగా సినిమాలు రావాలి" అని కొందరు తెలుగు వాళ్లు మాటిమాటికీ అంటూ ఉంటారు కదా! మలయాళం వాళ్లు చాలా ఏళ్ళ నుంచి ఆ పనిని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. షేక్స్‌ఫియర్ రాసిన ప్రసిద్ధ నాటకం 'ఒతెల్లో' ఆధారంగా మలయాళ దర్శకుడు జయ‌రాజ్ 1997లో 'కలియాట్టం' అనే సినిమా తీశారు. అందులో తెయ్యాం(కేరళ సంప్రదాయ రీతి) కళాకారుడిగా సురేష్ గోపి నటించారు. చెప్పుడు మాటలు విని, ఆ అనుమానంతో భార్యను చంపే పాత్ర అది. ఆ తర్వాత నిజం తెలుసుకుని పశ్చాత్తాపంతో ఆత్మహత్యకు పాల్పడతాడు. సురేష్ గోపి కెరీర్లో The Best Performance. ఆ నటన జాతీయ అవార్డుల కమిటీకి నచ్చింది. ఉత్తమ నటుడిగా పురస్కారం ఇచ్చారు.
 
గుజరాత్‌లో ఒకప్పుడు సంతోక్‌బెన్ జడేజా అనే మహిళా గ్యాంగ్‌స్టర్ ఉండేవారు. మహాత్మాగాంధీ పుట్టిన పోర్‌బందర్ ప్రాంతంలో ఆమె పేరు చెప్తే హడల్. ఆమె భర్త సర్మన్ ముంజా జడేజా ఒక మిల్లు కార్మికుడి స్థాయి నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగారు. ఆయన మరణానంతరం అతని హత్యకు ప్రతీకారంగా ఆమె ఆ స్థానాన్ని భర్తీ చేశారు. ఆమె గ్యాంగ్ మీద 14 హత్య కేసులు, 500 ఇతర కేసులు నమోదయ్యాయి. 1990లో జనతాదళ్ పార్టీ తరఫున ఆమె ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. ఆమె జీవితం ఆధారంగా దర్శకుడు 1999లో వినయ్ శుక్లా 'గాడ్ మదర్' అనే హిందీ సినిమా తీశారు. ప్రధాన పాత్ర షబానా ఆజ్మీ పోషించారు. సినిమాలోని అద్భుతమైన నటన ఆమెకు ఐదోసారి జాతీయ ఉత్తమ నటి అవార్డును అందించింది. 
 
పైన చెప్పిన సినిమాల్లోని మూడు ప్రధాన పాత్రలూ నేర చరితులే! చట్టప్రకారం శిక్షార్హమైన వ్యక్తులే! అయితే ఆ సినిమాలన్నీ వారి తరఫున నడిచాయి. వారి వాదన వినిపించాయి. ఆయా నటీనటులకు జాతీయ అవార్డులు అందించాయి. 
 
'పుష్ప' సినిమాలో స్మగ్లర్ పాత్ర పోషించిన అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డా..? ఈ కామెంట్ ఒకటి రెండు చోట్ల చూశాను. ఆ క్షణాన ఈ సినిమాలు గుర్తొచ్చాయి. నేరస్తులూ ఈ సమాజంలోనే పుడతారు, పెరుగుతారు, ఇక్కడే మసలుతారు. అలాంటి వారి పాత్రలు చేయడం ఒకరకంగా కత్తి మీద సాము. స్కూల్ టీచర్, వ్యాపారి, గృహస్థు పాత్రలకు సమాజంలో ఉండే జనాల నుంచి బోలెడన్ని రెఫరెన్స్‌లు దొరుకుతాయి. కానీ నేరస్తుల పాత్ర ఎలా చేయాలో ఎవర్ని అడగాలి? ఆ సహజత్వాన్ని తెరపైకి ఎలా తేవాలి? అతి కష్టమైన పని కదా!
 
'జై భీమ్' సినిమాలో సూర్యకు అవార్డు రాని బాధంతా ఇలా అల్లు అర్జున్ మీదకు మళ్లిందేమో తెలియదు. కానీ అతని పాత్ర స్మగ్లర్ కాబట్టి అవార్డు ఇవ్వకూడదని అనడం ‌సరికాదు. ఉదాత్తమైన పాత్రలకే అవార్డులు ఇస్తాం అని అవార్డుల కమిటీలు ఏరోజూ గిరిగీసుకొని కూర్చోలేదు. 'పాత్ర ఏదైనా సరే, మీరు బాగా నటిస్తే అవార్డు ఇస్తాం' అనే అనుకుంటాయి. ఈసారీ అలాగే ఇచ్చాయి.
 
నేరస్తుల పాత్రలకు అవార్డులు ఇవ్వం అని భీష్మించుకుని ఉంటే పై సినిమాల్లో నటులకు అవార్డులు వచ్చేవి కావు. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. 1994లో శేఖర్ కపూర్ తీసిన 'బండీట్ క్వీన్' సినిమాలో 'ఫూలన్‌దేవి' పాత్ర బాగా చేశారని సీమా బిశ్వాస్‌కి జాతీయ అవార్డు ఇచ్చారు కదా? 30 ఏళ్ల క్రితమే జరిగిన విషయం అది. అంతెందుకు? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 'God Father' సినిమాలో డాన్ పాత్ర పోషించిన 'Marlon Brando'కి ఆస్కార్ ఉత్తమ నటుడి పురస్కారం ప్రకటించిన సంగతి గుర్తు చేసుకోండి.(American Indians మీద వివక్షకు నిరసనగా ఆయన ఆ అవార్డును తిరస్కరించడం ఆ తర్వాత జరిగిన పరిణామం). 'The Silence of the Lambs' సినిమాలో సీరియల్ కిల్లర్ పాత్ర పోషించిన Anthony Hopkinsకి కూడా ఆస్కార్ ఉత్తమ నటుడి పురస్కారం అందించారు. ఇవన్నీ చరిత్రలో జరిగిన విషయాలే! 
 
'పుష్ప' సినిమాలో పాత్ర స్మగ్లర్ అయినా, దాన్ని అత్యంత ప్రభావవంతంగా పోషించారు అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ అనే ఇమేజ్‌ని పక్కన పెట్టి, డీగ్లామర్‌గా నటించారు. తనకు అలవాటు లేని చిత్తూరు యాసలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకొన్నారు. కాబట్టి అవార్డుకు అన్నివిధాలా అర్హులు. 
 
మరి 'జై భీమ్'? అసలా సినిమా అవార్డుల కోసం పంపారా? అది తెలియాలి ముందు. ఒకవేళ పంపినా అన్ని నిబంధనలకు అనుగుణంగా వాళ్ల దరఖాస్తు ఉందా? ఇది చాలా కీలకమైన విషయం. కొన్ని సినిమాలు చాలా బాగున్నా దరఖాస్తు సమయంలో నిబంధనలు పాటించకపోతే అవార్డుల కమిటీ రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి అలా ఏమైనా జరిగిందో తెలియాలి. సరే! అన్నీ కుదిరి కమిటీ దాకా వెళ్లి ఉండొచ్చు. కానీ గతేడాది సూర్యకు 'సూరరై పోట్రు' అనే సినిమాకు గానూ ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చారు. ఈసారి మళ్లీ ఆయనకేనా అనే సందేహం వచ్చి ఉండొచ్చు. అలా వరుసగా ఒకే నటుడు/నటికి గతంలో ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. కానీ కమిటీ ఎలా ఆలోచిస్తుందో ఎవరు చెప్పగలరు? వీటన్నింటినీ మించి లాయర్ పాత్ర పోషించడం కన్నా, స్మగ్లర్ పాత్ర పోషించడం కష్టం అనే ఆలోచనతో అల్లు అర్జున్‌కి అవార్డు ప్రకటించి ఉండొచ్చు. 
 
ఏదేమైనా.. 69 ఏళ్ల తర్వాత తొలిసారి ఒక తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది. ఆనందం!!