శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 9 మే 2017 (04:33 IST)

బాహుబలి-2ని చూసి వాత పెట్టుకుంటే ఖర్చయిపోతారు జాగ్రత్త: ప్రముఖ నిర్మాత హెచ్చరిక

ఒక సినిమా ప్రపంచ రికార్డు సాధించిందిని మనమూ అలా భారీగా డబ్బు ఖర్చుపెట్టి బాహుబలి అమ్మలాంటి సినిమాను తీసేద్దామని ప్రయత్నాలు చేస్తే అటూ ఇటూ కాకుండా గబ్బుబట్టి పోవడం ఖాయమని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

ఒక సినిమా ప్రపంచ రికార్డు సాధించిందిని మనమూ అలా భారీగా డబ్బు ఖర్చుపెట్టి బాహుబలి అమ్మలాంటి సినిమాను తీసేద్దామని ప్రయత్నాలు చేస్తే అటూ ఇటూ కాకుండా గబ్బుబట్టి పోవడం ఖాయమని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. గతంలో విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి అక్కినేని, కాంతారావును పెట్టి తీసిన రహస్యం సినిమా కానీ, ప్రపంచంలో 21 భాషల్లో ఒకేసారి నిర్మాణం పూర్తయిన ప్రపంచం అనే పాత సినిమా కానీ, తమిళ దర్శకుడు శంకర్‌ రిచ్‌గా సినిమాలు తీస్తున్నాడని పోటికి వెళ్లి నాగార్జున, సుస్మితా సేన్‌లను పెట్టి తెలుగులో తీసిన భారీ సినిమా రక్షకుడు కానీ బాక్సాఫీసు ముందు తేలిపోయాయని భరద్వాజ చరిత్రను గుర్తు చేశారు. వందల కోట్లు పెట్టి తీసినంత మాత్రాన బాహుబలి సినిమా తయారు కాదని, ఒక సినిమా యూనిట్ మొత్తంగా జీవితాలను పణంగా పెట్టి మనసావాచా కర్మేణా నమ్మి పనిచేయకపోతే, లాభాలు కొల్లగొట్టే దృష్టితో, మనమూ రికార్డులు బ్రేక్ చేసేద్దామనే దృష్టితో సినిమాలు తీస్తే వచ్చేవి బాహుబలిలు కావని బాహుబలులే అని తమ్మారెడ్డి చెబుతున్నారు. బాహుబలిని అనుకరించి సినిమా తీయొద్దని సున్నితంగా తెలుగు చిత్రసీమను హెచ్చరిస్తున్న తమ్మారెడ్డి అభిప్రాయాలను ఆయన మాటల్లోనే విందాం.
 
"ఒక మాట గుర్తు పెట్టుకోండి. కావాలంటే నోట్ చేసుకోండి. మీరు మనసా వాచా కర్మేణా నమ్మి పనిచేస్తే.. అది సినిమానే కాదు.. ఏ పనినయినా నమ్మి చేస్తే బాహుబలి అంత సక్సెస్ మనకు వస్తుంది. అంటే చేసే ప్రతి వాళ్లూ నమ్మి చేయాలి. ఒక డైరెక్టర్ చేస్తేనో, ఒక ప్రొడ్యూసర్ చేస్తేనో, ఒక హీరో చేస్తేనో అయ్యే పనికాదు. మొత్తం యూనిట్‌లో ఉన్న ప్రతి మనిషీ నిజంగా బాహుబలి అనే సినిమాకు మనసా వాచా కర్మేణా పనిచేశారు. నన్ను నమ్మండి. ఇది నిజం. అందుకే ఇవ్వాళ ఆ సినిమా అంత గొప్ప సినిమా అయింది. అంటే అందులో పనిచేసిన వెయ్యిమంది, 2 వేలమంది, అయిదువేల మంది ఇలా ఎంతమంది చేసినా మనసా వాచా కర్మేణా ఆ సినిమానే నమ్మారు. ఆ సినిమానే జీవితం అనుకున్నారు. ఆ సినిమానే పైకి రావాలి అనుకున్నారు. చరిత్ర సృష్టించాలనుకున్నారు. 
 
నిజంగా వాళ్లంత మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అంతమంది కోరికలు ఆ సినిమాను అంత సక్సెక్ చేశాయి. వాళ్ల కష్టం ఆ సినిమాను అంత సక్సెస్ చేసింది. మనం కూడా కష్టపడితే సక్సెస్ తేవచ్చు, సక్సెస్ తెచ్చుకోవచ్చు అని గుర్తించండి. అంతేకాని ఆ సినిమా ఆడింది కాబట్టి నాలుగు వందల కోట్లో, అయిదు వందల కోట్లో ఖర్చుపెట్టాడు కాబట్టి మనం కూడా ఖర్చుపెడదాం అంటే కుదరదు. నిన్ననే చెప్పాను. ఒక హీరో వంద కోట్లు చేసుకోని, ఇంకో హీరో 200 కోట్లు చేసుకుని మాదీ అయిదు వందల కోట్లు అయింది అని చంకలు గుద్దుకుంటే ఉన్నదీ ఉంచుకున్నదీ పోతుంది. దయచేసి అలాంటి అనుకరణలు దయచేసి చేయవద్దు. 
 
చాలామంది అంటున్నారు. అంత ఖర్చుపెడితే మేమూ తీసేవాళ్ళమండీ, అంత అయింది, ఇంత అయింది అని పిచ్చి పిచ్చి కామెంట్లు చాలా చేశారు. చేస్తున్నారు. చిన్న ఉదాహరణ చెబుతాను. గతంలో చాలామంది ఇలాగే ఖర్చు పెట్టి సినిమాలు చేశారు. 'రహస్యం' అని ఆరోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు గార్లు ఒక సినిమా చేశారు. బి. సరోజా దేవి, కృష్ణకుమారి ఇలా ఆ సినిమాలో లేని ఆర్టిస్టులే లేరు ఆరోజుల్లో. చాలా ఖర్చు పెట్టి తీసిన సినిమా అది. చాలా పెద్ద సినిమా తీశారు. ఇవ్వాళ బాహుబలికి ఉన్నంత క్రేజీ ఉండేది దానికి ఆరోజుల్లో. కానీ రిలీజ్ అయినాక ఏం లేదు.
 
అలాగే అప్పట్లోనే 'ప్రపంచం' అని ఒక సినిమా చేశారు. మీరెవరూ వినికూడా ఉండరు. దాన్ని ప్రపంచంలోని 21 భాషల్లో తీశారు. ఇంగ్లీషులో, సింహళ భాషలో కూడా తీశారు. 21 భాషల్లో తీస్తే ఆ సినిమా ఒక రోజో లేదా ఒక షోనో ఆడింది. విపరీతంగా ఖర్చుపెట్టారు. సింహళం నుంచి మూనాస్ అనే ఆయన వచ్చి ఆ సినిమా తీసారు. ఆరోజుల్లోనే 15 కోట్లో లేక 20 కోట్లో ఖర్చు పెట్టి తీశారు. చివరకి మొత్తం పోయింది. 
 
తర్వాత పాతికేళ్ల క్రితం 'రక్షకుడు' అని నాగార్జున, సుస్మిత సేన్ లను పెట్టి ఒక సినిమా తీశారు. అప్పట్లో తమిళ దర్శకుడు శంకర్ సినిమాలు చాలా కాస్ట్‌లీగా వస్తున్నాయి. మనం కూడా అంత ఖర్చుపెట్టి తీద్దాం అని తీశారు. అదీ పోయింది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే వాళ్లేం అంత తక్కువోళ్లు అని కాదు. వాల్లు కూడా ఒక నమ్మకంతోటే చేశారు. కానీ డబ్బు ఖర్చుపెడితేనే సినిమాలు ఆడతాయి అంటే కరెక్టు కాదు. కావల్సింది ఎంత సమపాళ్లలో రావాలి? పని చేసేవాళ్లు ఎంత సిన్సియర్‌గా పని చేయాలి? అనేది చాలా ముఖ్యం. ఊరకే డబ్బులిస్తున్నారు కాబట్టి మనం పనిచేస్తున్నాం అనుకోవటం కాదు. డబ్బులు పెడితే పనవుతుంది అనుకోవద్దు. ఈ రెండింటినీ పక్కనబెట్టి సినిమాను నమ్మి చేస్తే సక్సెస్ వస్తుంది.. అప్పుడే మీకు బాహుబలి వస్తుంది. బాహుబలిని చూసి మనమూ రిచ్‌గా తీద్దాం అనుకుంటే పులిని చూసి వాత పెట్టుకున్నట్లే. జాగ్రత్త."
 
ఇదీ బాహుబలి సినిమా వెనుక ఉన్న కష్టం గురించి, దాన్ని ఊరకే అనుకరిస్తే వచ్చే నష్టం గురించి అలనాటి ప్రముఖ తెలుగు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెబుతున్న, చేస్తున్న హెచ్చరిక. 3 నెలల్లో లేదా ఆరునెలల్లో 150 కోట్లు, 200 కోట్లుఖర్చు పెట్టి సినిమా తీసి మరో బాహుబలిని ప్రపంచం మీదికి వదులుదాం అనే తిక్క ఆలోచనలు ఉంటే వాటిని వెంటనే మానుకోవాలని తెలుగు చిత్ర సీమ ప్రముఖులకు ఆయన హితవు చెబుతున్నారు. ఆయన హితవులోని సానుకూల అంశాలను పట్టించుకుంటే చాలు ఎవరికైనా తత్వం బోధపడినట్లే..