గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ చిత్రం పెద్ది (పెద్దిరెడ్డి)గా రాబోతుందని పాఠకులకు విదితమే. నేడు చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది అనే టైటిల్ ను చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందిస్తోన్న చిత్రంతో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమవుతున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ పాన్-ఇండియా సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది, సుకుమార్ రైటింగ్స్ సృజనాత్మక శక్తి కూడా తోడవుతుంది. ఈ హ్యూజ్ బడ్జెట్ మూవీని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
నిజమైనత తుపాను రాక మునుపే మేకర్స్ దాని రాకను తెలియజేసేలా ప్రీ లుక్‌ను విడుదల చేసి సినిమాపై అందరిలో ఆసక్తిని మరింతగా పెంచారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలను తెలియజేస్తూ మేకర్స్ సినిమా టైటిల్‌ను పెద్ది అని అనౌన్స్ చేశారు. ఈ టైటిల్ రామ్ చరణ్ పాత్రలోని శక్తి, గాంభీర్యాన్ని సంపూర్ణంగా, గొప్పగా తెలియచేస్తోంది.
పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ అందరూ ఆశ్చర్యపోయి చూసేలా తన లుక్‌ను రగ్డ్‌గా మార్చుకోవటం విశేషం. ఈ రా క్యారెక్టర్‌లో నటించటానికి ఆయన స్టార్ ఇమేజ్‌ను పక్కకు పెట్టి ఇంటెన్స్, రియల్‌గా కనిపించే ప్రయత్నం చేశారు. ఇది వరకు రామ్ చరణ్ కనిపించనటువంటి సరికొత్త లుక్ ఇది. పదునైన చూపులు, గజిబిజి జుట్లు, గుబురు గడ్డం, ముక్కుకి రింగు, మాసిన బట్టలు, సిగరెట్ తాగుతూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవతార్‌లో కనిపిస్తున్నారు చరణ్. మరో పోస్టర్‌ను గమనిస్తే పాత క్రికెట్ బ్యాట్‌ను పట్టుకుని ఫ్లడ్ లైట్ వెలుతురులో ఓ గ్రామంలోని స్టేడియంలో నిలుచుని ఉన్నాడు. ఈ రెండు పోస్టర్స్ సినిమాలో హీరో పాత్ర నేపథ్యాన్ని, కథ, కథనం.. గ్రామీణ వాతావరణంలోని తీవ్రత, నాటకీయత సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.
డైరెక్టర్ బుచ్చిబాబు సానా రామ్ చరణ్ పాత్రను ఎంతో జాగ్రత్తగా రూపొందించినట్లు పోస్టర్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. తను చెప్పాలనుకున్న విషయాలను పోస్టర్స్ రూపంలో చూపెట్టారు. హీరో రా క్యారెక్టర్ తన పాత్రలోని ఇతర భావాలను చెప్పేలా పోస్టర్స్‌ను డిజైన్ చేశారు. రామ్ చరణ్ తన పాత్రకు ప్రామాణికతను తీసుకురావడానికి.. బుచ్చిబాబు ఏదో కొత్తదనాన్ని సృష్టించేందుకు.. తమ నిబద్ధతను చూపిస్తున్నారు.
పెద్ది చిత్రం భారీ స్థాయిలో, అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో, అత్యాధునిక సాంకేతికతతో, అద్భుతమైన దృశ్యాలతో, ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో రూపొందుతోంది. సినిమాలోని డెప్త్, భారీతనం గొప్పతనం అభిమానులను, సినీ పరిశ్రమలోని వారిని ఆకర్షిస్తోంది. ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యే ఓ అనుభవాన్ని సినిమాను అందించటానికి సిద్దమవుతోంది.
ఇతర చిత్ర పరిశ్రమల్లోని గొప్ప నటీనటులు ఈ సినిమాలో వర్క్ చేస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ కరుణడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ ఇందులో కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర ప్రముఖ పాత్రల్లో మెప్పించనున్నారు.
సాంకేతిక విభాగానికి వస్తే ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ తనదైన బాణీలతో మరుపురాని సంగీతాన్ని అందిస్తారనటంలో సందేహం లేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సన్నివేశాలకు తన సినిమాటోగ్రఫీతో ప్రాణం పోస్తుండగా, మరో జాతీయ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేస్తుండగా అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
పెద్ది సినిమాపై అనౌన్స్మెంట్ రోజు నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ అంచనాలను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. భారీ తారాగణం, సాంకేతిక నిపుణుల బృందం కలయికలో రూపొందుతోన్న ఈ చిత్రం గొప్ప చిత్రంగా అందరినీ మెప్పించనుంది.
తారాగణం: రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు
సాంకేతిక సిబ్బందిరచయిత, దర్శకుడు: బుచ్చిబాబు సానా
సమర్పకులు: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్ల
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్