శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 మే 2022 (12:41 IST)

శ్రద్ధా శ్రీనాథ్ బహుభాషా చిత్రం విట్ నెస్

Shraddha Srinath,  Rohini Molleti
Shraddha Srinath, Rohini Molleti
తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో విభిన్న చిత్రాలు అందించి సౌత్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన బ్యానర్ 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ'. గతంలో 'ఓ బేబీ', 'గూఢచారి', 'వెంకీ మామ', 'కుడి ఎడమైతే', 'రాజ రాజ చోర' మరియు 'బ్లడీ మేరీ' వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకున్న ఈ సంస్థ తాజాగా మరో విభిన్న చిత్రాన్ని ప్రకటించింది. 'విట్ నెస్' పేరుతో తెరకెక్కుతున్న ఈ బహుభాషా చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి మొల్లేటి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
 
నగరంలో ప్రతిరోజూ ఏదో ఒక నేరం గురించి వింటుంటాం, మరుసటి రోజు మరచిపోతుంటాం. ఇది కూడా అలాంటి నేరమే. కానీ కొన్ని కారణాలు ఈ నేరాన్ని మరచిపోనివ్వకుండా చేస్తున్నాయి. దీనిపై జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ మంచితనం ముసుగేసుకున్న ఎందరో నిజస్వరూపాలను బహిర్గతం చేస్తుంది. పారిశుద్ధ్య కార్మికుల కేంద్రంగా రూపొందుతోన్న ఈ బహుభాషా చిత్రం మెట్రోపాలిటన్ నగరాలు మరియు వాటి కింద ఉన్న అదృశ్య కారిడార్‌ల యొక్క మునుపెన్నడూ చూడని దృశ్యాన్ని అందిస్తుంది.
 
మే డే శుభాకాంక్షలు తో తాజాగా విడుదల చేసిన 'విట్ నెస్' ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ఏదో విపత్కర పరిస్థితిలో చిక్కుకున్నట్లుగా కనిపిస్తున్నారు. అలాగే డ్రైనేజ్ పిట్ నుంచి సాయం కోరుతున్నట్లుగా ఒక చెయ్యి కనిపించడం పోస్టర్ లో చూడొచ్చు. నటిగా శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'యూ టర్న్', 'జెర్సీ', 'కృష్ణ అండ్ హిజ్ లీలా', 'విక్రమ్ వేద' వంటి సినిమాలతో సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'విట్ నెస్'లో ఆర్కిటెక్ట్‌గా కనిపించనున్న శ్రద్ధా శ్రీనాథ్ ఓ మంచి ఆశయం కోసం పోరాడుతుంది. శ్రద్ధా శ్రీనాథ్ మరియు రోహిణితో పాటు ఈ చిత్రంలో షణ్ముగరాజా, జి. సెల్వ, రాబర్ట్, రాజీవ్ ఆనంద్ మరియు ఎం.ఏ.కె.రామ్ కూడా నటించారు.
 
ప్రముఖ నిర్మాత టి.జి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీపక్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గానూ, దర్శకుడిగానూ పని చేసున్నారు. ముత్తువేల్, జెపి సానక్య స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి ఎడిటర్ గా ఫిలోమిన్ రాజ్, సంగీత దర్శకుడిగా రమేష్ తమిళమణి వ్యవహరిస్తున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. 'విట్ నెస్' చిత్రంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోలీవుడ్ లో అడుగుపెడుతుండటం విశేషం.