Madhu Priya: కాళేశ్వర స్వామి గర్భగుడిలో మధుప్రియ ఆల్బమ్ సాంగ్ షూటింగ్.. అరెస్ట్ చేస్తారా? (video)
ప్రముఖ సింగర్ మధుప్రియ వివాదంలో చిక్కుతుంది. తన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌ను భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో షూట్ చేయడం వివాదానికి దారి తీసింది. అది కూడా భక్తులు దర్శనానికి రాకుండా గుడి తలుపులు మూసేసి గర్భగుడిలో సాంగ్ షూటింగ్ జరపడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
మధుప్రియ తీరుపై పలువురు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భగుడిలో సాంగ్ షూట్‌కు అనుమతి ఎవరు ఇచ్చారంటూ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా వరకు ఆలయాల్లో ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేధం ఉంది.
అలాగే కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలోనూ ఫొటోలు, వీడియోలు తీయడానికి అనుమతి లేదు. అలాంటి క్షేత్రంలోని గర్భగుడిలో మధుప్రియ పాడటం సరికాదని బీజేపీ వాదిస్తోంది. అక్కడ కెమెరాలు పెట్టి మరీ తన పాట చిత్రీకరణ చేయడం పెద్ద దుమారంను రేపుతోంది.
ఈనెల 20వ తారీకు గాయని మధుప్రియ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలోని గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ షూట్ చేశారు. గర్భగుడిలోకి వెళ్లడానికి ఆమెకు ఆలయ అధికారులు అనుమతి ఇవ్వలేదని కొందరు అంటూ ఉంటే, కొందరు ఈవో అనుమతితోనే మధుప్రియ గర్భగుడిలో షూటింగ్ చేసిందని కొందరు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విషయమై ఆలయ అధికారుల నుంచి అధికారికంగా స్పందన రాలేదు.
ఇకపోతే.. ఇటీవల రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మధు ప్రియ పాడిన గోదారి గట్టుమీద సాంగ్ కూడా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.