1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 24 డిశెంబరు 2019 (20:46 IST)

అందుకే.. మ‌త్తు వ‌ద‌ల‌రా అంద‌రికీ న‌చ్చుతుంది - కీరవాణి త‌న‌యుడు శ్రీసింహ

నాన్నపై ఆధారపడకుండా నా కాళ్లపై నేను నిలబడి నా సొంతంగా ఏదైనా సాధిస్తే సంతృప్తిగా వుంటుంది. అందుకే నాన్నకు తెలియకుండానే సుకుమార్ గారి దగ్గర సహాయ దర్శకుడిగా, మత్తు వదలరాతో హీరోగా కెరీర్‌ను మొదలుపెట్టాను అంటున్నారు హీరో శ్రీసింహ. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా పరిచయమవుతున్న చిత్రం మత్తు వదలరా. 
 
రితేష్‌ రానా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
ఈ సంద‌ర్భంగా మ‌త్తు వ‌ద‌ల‌రా చిత్ర విశేషాలు శ్రీసింహా మాట‌ల్లోనే... నటన పట్ల నాకున్న ఆసక్తి గురించి నిర్మాత చెర్రికి చాలా రోజులుగా తెలుసు. రంగస్థలం ప్రారంభం కావడానికి ముందు మైత్రీ మూవీస్ నిర్మాతలకు దర్శకుడు రితేష్ ఈ కథ వినిపించారు. పెద్ద సినిమాలతో వారు బిజీగా ఉండటంతో సినిమా వెంటనే ప్రారంభం కాలేదు. రంగస్థలం సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. 
 
ఆ సమయంలో నటుడిగా రాణించగలననే, నాతో సినిమా చేయచ్చనే నమ్మకం నిర్మాతలు నవీన్, రవిశంకర్‌లో కలిగింది. సినిమా అంగీకరించిన తర్వాత మూడు నెలల పాటు నటనలో శిక్షణ తీసుకున్నాను. నిర్మాత చెర్రి తన బ్యానర్ క్లాప్ ఎంటర్‌టైనర్‌పై సినిమాను ప్రారంభించారు. రితేష్‌కు నాపై నమ్మకం కలిగేలా ఆరు నెలల పాటు వర్కషాప్స్, ఆడిషన్స్ చేశారు. నాన్నపై ఆధారపడకుండా నా సొంతంగా సాధించినది ఏదైనా సంతృప్తి ఉంటుంది. అందుకే నాన్నకు తెలియకుండా సినిమా చేశాను. బాలనటుడిగా సినిమాలు చేశాను. 
 
అప్పుడే నటన పట్ల నాకున్న ఆసక్తి గురించి ఇంట్లో వారికి అర్థమైంది. అయితే... నటననే కెరీర్‌గా ఎంచుకోవాలనే ఆలోచన మాత్రం ఉండేది కాదు. డిగ్రీ తర్వాత రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. అదే సమయంలో మత్తువదలరా సినిమాలో నటించే అవకాశం రావడంతో హీరోగా మారాను. ఎప్పుడూ నిద్రమత్తులో ఉండే డెలివరీబాయ్‌గా సినిమాలో నేను కనిపిస్తాను. 
 
ఊరి నుంచి వచ్చి చాలిచాలని జీతంతో పని చేసే అతడు ఓ సమస్యలో చిక్కుకుంటాడు. ఆ ఇబ్బంది నుంచి ఎలా బయటపడ్డాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. మూడు రోజుల్లో జరిగే కథ ఇది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతుంది. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. ఒక్కో చిక్కుముడి వీడుతూ ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. ఖ‌చ్చితంగా అంద‌రికీ ఈ సినిమా న‌చ్చుతుంది అని చెప్పారు.