నిర్మాతలుగా మారిన తెలుగు కథానాయకులు
సినిమా కథానాయకులుగా వేరే వారి నిర్మాణంలో సినిమాలలో నటించడం ఇప్పటివరకు చూస్తున్నాం. హీరోలుగా తాము సంపాదించింది ఎక్కువభాగం రియల్ ఎస్టేట్‌లోనూ, స్టూడియోల నిర్మాణంలోనే చాలా మంది పెడుతుంటారు. ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా సినిమా నిర్మాణంలో పెడుతున్నారు. బయట నిర్మాతతో కలిసి హీరోలు తాముకూడా నిర్మాతగా ఓ చేయి అందిస్తున్నారు. బాలీవుడ్‌లో ఎప్పటినుంచో వున్న ఈ ఒరవడి క్రమేణా తెలుగు సినిమా రంగలోకి వచ్చేసింది. ఎక్కడ సంపాదించింది అక్కడే పెట్టుబడులు పెట్టుకోవడం అనే సూత్రాన్ని వారు పాటిస్తున్నారు.
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే కొత్త హీరోలతో కలిసి సంయుక్త నిర్మాణంలో అల్లు అరవింద్ బయట నిర్మాతలతో పలు సినిమాలు నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ కూడా వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నాడు. ఇక మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ భాగం స్వయంగా నిర్మించినవే. ఆ తర్వాత మహేస్‌బాబు తన పేరుతో కలిసి వచ్చే ఎం.బి. మాల్ పేరుతో నైజాం పంపిణీదారుడు సునీల్ నారంగ్‌తో కలిసి మాదాపూర్‌లో థియేటర్ల బిజినెస్ చేస్తున్నాడు. అదేవిధంగా నాని కూడా తన స్వంత నిర్మాణంలో కొత్త తరానికి అవకాశం కల్పిస్తూ సినిమాలు నిర్మిస్తున్నాడు. `మేజర్` హీరో అడవిశేష్ కూడా భాగస్వామ్యంతో సినిమా చేస్తున్నాడు.
ఇక ప్రభాస్ కూడా బాహుబలితర్వాత మైత్రీమూవీస్ సంస్థను స్థాపించి తన కుటుంబసభ్యులతో సినిమా నిర్మాణంలోకి ప్రవేశించారు. బాలకృష్ణ కూడా తన తండ్రి బయోపిక్‌ను రెండు భాగాలుగా నిర్మించి ఆ పాత్రను ఆయనే పోషించాడు. సురేష్ ప్రొడక్షన్ పేరుతో సురేష్‌బాబు నిర్మించే సినిమాలలో వెంకటేష్, రానాలు నటిస్తున్నారు. మరో నిర్మాత బెల్లంకొండ సురేష్ కూడా తన కొడుకు సాయి శ్రీనివాస్‌తో సినిమాలు చేస్తున్నాడు. తాజాగా హిందీ `ఛత్రపతి` సినిమాను జయంతిలాల్ గడాతో కలిపి నిర్మిస్తున్నాడు. అదేవిధంగా నందమూరి కళ్యాణ్‌రామ్ ఎన్.టి.ఆర్. ఆర్ట్స్ పేరుతో సినిమాలు నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నాడు. హీరో రామ్ కూడా సంయుక్తంగా సినిమాలు తీస్తున్నాడు.
ఇప్పుడు తాజాగా రవితేజ నిర్మాతగా మారాడు. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా నిన్ననే ప్రారంభమైంది. ఆర్.టి. టీమ్ వర్క్స్ అనే పేరు కూడా పెట్టాడు. ఆర్.టి. అంటే రవితేజ అని అర్థం. పేరు పెట్టని ఈ సినిమాలో ఎం.ఆర్.ఓ.గా నటిస్తున్నాడు. హైదరాబాద్‌లో నిన్నటినుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ ప్రారంభమైంది. వీరు కాకుండా మరికొంత మంది హీరోలు నిర్మాతలుగా మారబోతున్నారు. కొత్తగా హీరోగా పరిచయం అయ్యేవారంతా నిర్మాతలే కావడం విశేషం.