రేవ్ పార్టీలో హేమ పట్టుబడింది, ఆ వీడియో సంగతి తేలుస్తాం: బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్
బెంగళూరులోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీలో తను లేనంటూ నటి హేమ అవాస్తవం చెప్పారని బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. రేవ్ పార్టీలో రైడ్ జరిగినప్పుడు హేమ కూడా ఉన్నట్టు మీడియాకు సమాచారం అందింది. కానీ హేమ మాత్రం తను లేనని, అక్కడి ఫామ్‌హౌస్ నుంచి వీడియో తీసి అది హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్ అని అబద్ధం చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు.
తాజాగా బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ మాట్లాడుతూ... రేవ్ పార్టీలో హేమ ఉన్న మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. దాడి సమయంలో హేమ కూడా పార్టీలో ఉన్న మాట వాస్తవమేనని చెప్పాడు. దాడి సమయంలో పట్టుబడ్డ హేమ, ఫామ్‌హౌస్‌లో ఎలా వీడియో తీశారనే దానిపై కూడా విచారిస్తామని చెప్పారు. ఇప్పటికే పార్టీలో పాల్గొన్న వారి రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం సేకరించారు. వారిలో హేమ కూడా ఒకరని పోలీసు కమిషనర్ దయానంద్ స్పష్టం చేశారు.
దీంతో దాడి సమయంలో తాను లేనని, పార్టీకి రాలేదని చెబుతున్న నటి హేమ ఇరకాటంలో పడ్డట్లయింది. పార్టీలో ఉన్న వారందరికీ నోటీసులిచ్చి విచారణ జరుపుతామన్నారు. వారిలో హేమకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు.