ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (12:57 IST)

కళాతపస్వీ విశ్వనాథ్ పరమపదం - హైదరాబాద్‌లో కన్నుమూత

kvishanath
తెలుగు చిత్రపరిశ్రమలో మరో తీరని విషాదం నెలకొంది. కళాతపస్సీ కె.విశ్వనాథ్ పరమపదించారు. ఆయన వయస్సు 92 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన.. గురువారం రాత్రి హైదరాబాద్ నగరంలో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆ వెంటనే ఆయనను హైదరాబాద్ నగరంలోని అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో తెలుగు, తమిళ చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కె.విశ్వనాథ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 
 
1930, ఫిబ్రవరి 19వ తేదీన పెద పులిపర్రులో ఆయన జన్మించారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా రేపల్లె మండలంలో ఉంది. ఆయన పూర్తిపేరు కాశీనాథుని విశ్వనాథ్. ఆయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం - సరస్వతమ్మ. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్, ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో బీఎస్సీ పూర్తిచేసిన విశ్వనాథ్.. తండ్రి చెన్నైలో విజయవాహిని స్టూడియోలో పని చేస్తుడటంతో చెన్నైకు వెళ్లారు. అక్కడ సౌండ్ రికార్డిస్టుగా అదే స్టూడియోలే పనికి చేశారు.
 
పాతాళభైరవి చిత్రానికి తొలిసారి అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసిన ఆయన 1965లో ఆయన తొలిసారి ఆత్మగౌరవం అనే చిత్రానికి దర్శకుడిగా పని చేశారు. తొలి సినిమాకే నంది పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగులో 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్.. బాలీవుడ్‌లో 9, తమిళంలో మరికొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు.
kvishwanath
 
తెలుగు చిత్రపరిశ్రమలో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను నిర్మించారు. వీటిలో శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, సిరిసిరిమువ్వ, శృతిలయలు, సిరివెన్నెల, స్వయంకృషి, స్వరాభిషేకం, ఆపద్బాంధవుడు వంటి ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు.సినీ రంగానికి ఆయన చేసిన కృషికిగాను 2016లో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును లభించింది. 
 
1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, అదే యేడాది పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. స్వాతిముత్యం 59వ ఆస్కార్ అవార్డుల బరిలోనూ నిలిచింది. ఆసియా ఫసిఫిక్ చలనచిత్ర వేడుకల్లో స్వయంకృషి, సాగరసంగమం, సిరివెన్నెల సినిమాలను ప్రదర్శించారు. స్వారభిషేకం చిత్రానికి ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం లభించింది. నెల్లూరులోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం విశ్వనాథ్‌ను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది.