గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 జనవరి 2021 (19:24 IST)

రామ్‌తో పరిచయం ఇప్పటిదికాదు... : సింగర్ సునీత

డిజిటల్ కంపెనీ అధినేత రామ్ వీరపనేని టాలీవుడ్ సింగర్ సునీత ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నారు. శంషాబాద్‌ దగ్గరలోని అమ్మపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వేదికగా వీరి పెళ్లి జరిగింది. ఘనంగా జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. తన రెండో వివాహంపై ఆమె స్పందించారు. రామ్‌తో పరిచయం కాస్త పరిణయం వరకు ఎలా వెళ్లిందనే విషయంపై ఆమె వివరించారు. 
 
'నిజానికి రామ్‌‌తో పరిచయం ఈ నాటికి కాదు. ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ముఖ్యంగా, నా సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను చూసుకునేవాడు. అలా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం స్నేహంగా మారి బలపడటానికి చాలా సమయమే పట్టింది. 
 
మా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి రెండు కుటుంబాలతో మాట్లాడి వారు ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు నాకు ముందు పిల్లలే గుర్తుకు వచ్చారు. నా వ్యక్తిగత నిర్ణయాలతో పిల్లలు ఇబ్బంది పడకూడదని నేను భావిస్తాను. 
 
ఎప్పటి నుండో నా తల్లిదండ్రులు నన్ను వివాహం చేసుకోమని చెబుతున్నప్పటికీ పిల్లలు చిన్నవారు కావడంతో నా నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చాను. ఇక పిల్లలు పెద్దవారై వారు కూడా బాగా పరిణితి చెందారు. అందుకే రామ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సంగతిని వారికి చెప్పాను. 
 
నేను విషయం చెప్పగానే వారు నన్ను కౌగిలించుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అర్థం చేసుకునే పిల్లలు ఉండటం అదృష్టం. నా కుటుంబం కూడా ఎంతగానో సపోర్ట్‌ చేసింది. రామ్‌ నా భాగస్వామిగా దొరకడం నా అదృష్టం. ఈ జీవితం సాఫీగా సాగిపోతుందని ఆమె చెప్పుకొచ్చారు.