శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 మే 2018 (14:56 IST)

'‘కాశి'గా మళ్లీ ఊసురుమనిపించిన విజయ్ ఆంటోనీ.. (మూవీ రివ్యూ)

తెలుగు వెండితెరపై 'బిచ్చ‌గాడు' రూపంలో కనిపించి.. తొలి స‌క్సెస్ అందుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత ఆంటోనికి మంచి మార్కెట్ వచ్చింది. అయితే 'బిచ్చ‌గాడు' త‌ర్వాత విజ‌య్ ఆంటోని న‌టించిన 'భేతాళుడు',

మూవీ : కాశి 
విడుదల తేదీ : 18-05-18, శుక్రవారం 
నిర్మాణ సంస్థ‌: లెజెండ్ సినిమా 
న‌టీన‌టులు: విజ‌య్ ఆంటోని, అంజ‌లి, సునైన‌, అమృతా అయ్య‌ర్, నాజ‌ర్‌, త‌దిత‌రులు 
సంగీతం: విజ‌య్ ఆంటోని 
నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి 
రచన-దర్శకత్వం: కృతిక ఉదయనిధి 
 
తెలుగు వెండితెరపై 'బిచ్చ‌గాడు' రూపంలో కనిపించి.. తొలి స‌క్సెస్ అందుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత ఆంటోనికి మంచి మార్కెట్ వచ్చింది. అయితే 'బిచ్చ‌గాడు' త‌ర్వాత విజ‌య్ ఆంటోని న‌టించిన 'భేతాళుడు', 'యెమ‌న్‌', 'ఇంద్ర‌సేన' చిత్రాలు అనుకున్నంత స‌క్సెస్ కాలేదు. అయితే తెలుగులో త‌న‌కున్న మార్కెట్ దృష్ట్యా విజ‌య్ ఆంటోని చేసిన మ‌రో ప్ర‌య‌త్న‌మే "కాశి". 'బిచ్చ‌గాడు' త‌ర్వాత మ‌ద‌ర్ సెంటిమెంట్‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించిన కాశి ఎలాంటి విజ‌యాన్ని ద‌క్కించుకుందో తెలుసుకోవాలంటే ఓసారి కథను పరిశీలించాల్సిందే. కథలోకి వెళితే...

కథ.. 
భ‌ర‌త్ (విజ‌య్ ఆంటోని) అమెరికాలో పేరు మోసిన వైద్యుడు. తండ్రి కూడా ఓ డాక్టరే. వీరికి ప్రపంచ వ్యాప్తంగా ఆస్పత్రి శాఖలు ఉంటాయి. ఓ సారి సీరియ‌స్ ఆప‌రేష‌న్ చేస్తున్న భ‌ర‌త్‌కి అత‌ని త‌ల్లి అస్వ‌స్థత‌కు గుర‌య్యార‌నే సమాచారం తెలుస్తుంది. ప‌రీక్ష‌లు చేస్తే ఆమెకు రెండు కిడ్నీలు పాడైనట్టు తేలుతుంది. త‌ల్లికి త‌న కిడ్నీని ఇవ్వ‌డానికి ముందుకొస్తాడు భ‌ర‌త్‌. ఆ క్ర‌మంలో ఆమె అత‌ని సొంత త‌ల్లి కాద‌ని అర్థ‌మ‌వుతుంది. 
 
దాంతో అతని సొంత త‌ల్లిదండ్రుల‌ను క‌నుక్కోవ‌డానికి భారత్‌కు వస్తాడు. ఆ క్ర‌మంలో అత‌ను క‌లుసుకునే వ్య‌క్తులు ఎవ‌రు? వారి క‌థ‌లేంటి? అత‌ని త‌ల్లి పార్వ‌తి ఎవ‌రు? అత‌ని తండ్రి ఎవ‌రు? ఆ విష‌యాల‌ను సేక‌రించేందుకు అతను పడిన పాట్లు వర్ణనాతీతం. ఈ క్ర‌మంలోనే అత‌నికి ఆయుర్వేద నాటు వైద్యురాలు (అంజ‌లి) ప‌రిచ‌య‌మ‌వుతుంది. తన తల్లిందడ్రుల వివవరాలు సేకరించి, ప్రియురాలు అంజలి, తన అమ్మమ్మను తీసుకుని అమెరికాకు వెళ్లిపోతాడు. ఇదే పూర్తి కథ.
 
విశ్లేష‌ణ‌.. 
విజ‌య్ ఆంటోని సినిమా అన‌గానే ఏదో కొత్త‌ద‌నం ఉంద‌నే ఆలోచ‌న ప్రేక్ష‌కుల్లో ఉంటుంది. దానికి తోడు తొలి ఏడు నిమిషాల సినిమాను ముందుగానే విడుద‌ల చేశారు. ఆ ఏడు నిమిషాల‌ను చూసిన వారికి సినిమా త‌ప్ప‌కుండా బావుంటుంద‌నే న‌మ్మ‌కం క‌లిగింది. ఒక వ్య‌క్తికి పాము క‌ల్లోకి రావ‌డం, ఎద్దు పొడ‌వ‌డానికి వ‌చ్చిన‌ట్టు త‌ర‌మ‌డం వంటివి ఆ ఏడు నిమిషాల్లో క‌నిపించాయి. హీరో గ‌తానికి వాటికీ సంబంధం ఉంద‌నే అంశాన్ని సినిమాలో చూపించారు. ఎద్దు వ‌ర‌కు స‌రేగానీ, పాము ఎందుకు కనిపిస్తుందో లాజిక్ లేదు. 
 
సినిమాలో అంద‌రినీ పాజిటివ్‌గా చూపించాల‌నే ప్ర‌య‌త్నం జ‌రిగింది. త‌న త‌ల్లిని వెతుక్కుంటూ వెళ్లే హీరోకి ఎదురైన క‌థ‌లు పంటికింద రాయిలా అనిపిస్తాయి. ఏ క‌థ‌కు ఆ క‌థే కొత్త‌గా అనిపించినప్ప‌టికీ, సినిమాలో మాత్రం క‌ల‌వ‌లేక‌పోయాయి. సినిమాలో ట్విస్టులు కూడా లేవు. ఏ సెంటిమెంట్ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ లేదు. పాట‌లు కూడా బ‌లంగా లేవు. 'బిచ్చగాడు' త‌ర్వాత ఆ స్థాయి హిట్ కోసం ఎదురుచూస్తున్న విజ‌య్ ఆంటోనీకి 'కాశి' నిరాశ‌నే మిగుల్చుతుందని చెప్పొచ్చు. 
 
ఈ చిత్రం ప్లస్ పాయింట్లను పరిశీలిస్తే, విజ‌య్ ఆంటోని న‌ట‌న‌, అత‌ను స‌మ‌కూర్చిన నేప‌థ్య సంగీతం, క‌థ‌ ఉండగా, అనాస‌క్తంగా సాగే క‌థ‌నం, పాట‌లు బాగోలేకపోవడం, రీరికార్డింగ్ మెప్పించ‌క పోవడం, ఫ్లాట్ స్టోరీ, సాగ‌దీసిన‌ట్టున్న క‌థ‌నం ఉండటం, ల‌వ్‌స్టోరీ ఎఫెక్టివ్‌గా లేక‌పోవ‌డం, అసలు చిత్రంలో హాస్యం లేకపోవడం మైనస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు.