గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఆగస్టు 2024 (16:20 IST)

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ రివ్యూ.. మ్యాజిక్ మిస్సింగ్.. క్యాట్ అండ్ మౌస్ గేమ్

raviteja  Bourse
మూవీ పేరు: మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ 
విడుదల తేదీ: 15.08.2024
నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, స‌చిన్ ఖేడ్‌ఖ‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, గౌత‌మి, స‌త్య‌, చ‌మ‌క్‌చంద్ర‌, ప్ర‌భాస్ శ్రీను తదితరులు
సినిమాటోగ్రఫీ: అయనంక బోస్ 
సంగీతం: మిక్కీ జే మేయ‌ర్‌
ఎడిటర్‌: ఉజ్వ‌ల్ కుల‌క‌ర్ణి
సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్ 
బ్యానర్స్‌: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణకుమార్, అభిషేక్ పాఠక్
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
 
ఎన్నో అంచ‌నాల మ‌ధ్య మాస్ మ‌హారాజ ర‌వితేజ (Ravi Teja), హ‌రీష్ శంక‌ర్ (Harish Shankar) కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మూడో చిత్రం ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌’ (Mr Bachchan). హిందీలో సూప‌ర్ హిట్ అయిన అజ‌య్ దేవ్‌గ‌ణ్ ‘రైడ్’ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా రీమేక్ చేశారు. 
 
ఈ సినిమాతో మ‌రాఠి ముద్దుగుమ్మ భాగ్య‌శ్రీ బోర్సే (Bhagyashri Borse) టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. ‘ఈగ‌ల్’ వంటి హిట్ చిత్రం త‌ర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.
 
2019లో వ‌రుణ్ తేజ్‌తో చేసిన ‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్’ వంటి హిట్ చిత్రం అనంత‌రం దాదాపు ఆరేండ్ల త‌ర్వాత హ‌రీశ్ శంక‌ర్ చేస్తున్న మూవీ అవ‌డంతో సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. అదే స‌మ‌యంలో అప్ప‌టికే విడుద‌ల చేసిన పాట‌లు, ట్రైల‌ర్, హ‌రీశ్ శంక‌ర్ ఇంట‌ర్వ్యూలు, సోష‌ల్ మీడియా ప‌రంగా జ‌రిగిన కాంట్ర‌వ‌ర్శీల‌తో హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఆగ‌ష్టు 15 గురువారం రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. చాలా రోజులుగా భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న ర‌వితేజకు ఈ సినిమా అయినా విజ‌యం అందించిందా లేదా చూద్దాం.
 
కథ: 
మిస్టర్ బచ్చన్(రవితేజ) నిజాయితీ గ‌ల‌ ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. సినిమా ప్రారంభ‌మే కొంద‌రు దుండ‌గులు ఉన్న‌ప‌ళంగా వ‌చ్చి ఓ పొగాకు వ్యాపారిపై దాడి చేస్తుండ‌గా మిస్టర్ బచ్చన్ (రవితేజ) కాపాడుతాడు. 
 
ఆపై వారే త‌మ కూతురుని వివాహం చేసుకోవాల‌ని కోర‌డంతో బచ్చన్ వాళ్లింటికి త‌న టీంతో ఫ్యామిలీ మెంబ‌ర్స్‌గా వెళ్లి రైడ్ చేసి వాళ్లింట్లో ఉన్న అవినీతి సొమ్ము వెలికి తీస్తాడు. ఈ క్ర‌మంలోనే బచ్చన్‌ సస్పెండ్ అయి తన సొంతూరు కోటిపల్లికి వెళ‌తాడు. 
 
అక్కడ మొద‌టి చూపులోనే జిక్కీ (భాగ్య శ్రీ)తో ప్రేమ‌లో ప‌డి పెళ్లి వ‌ర‌కు వెళ‌తారు. అదే స‌మ‌యంలో తిరిగి ఉద్యోగంలో జాయిన్ కావాల‌ని బచ్చన్‌కు అదేశాలు వ‌స్తాయి. దీంతో.. పెళ్లి తేదీ ఫిక్స్ చేసుకుని రాజ‌కీయంగా అంద‌రినీ శాసించే క్రూరుడైన‌ ఎంపీ ఇంటిపై రైడ్ చేస్తాడు. 
 
అధికారులని ఓ రేంజ్‌లో భయపెట్టే ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో బచ్చన్ రైడ్ చేయ‌గ‌లిగాడా? అక్కడ అతనికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదురయ్యాయి, ఆ రైడ్స్ ఎవ‌రు చేయించార‌నేదే ‘మిస్టర్ బచ్చన్’ కథ.

విశ్లేషణ:
ఓ నిజాయితీ అధికారి, అవినీతి ఎంపీ మ‌ధ్య జ‌రిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఈ చిత్రం. ప్ర‌భుత్వం అండ చూసుకుని అరాచకాలు చేయ‌డం, హీరో స‌డ‌న్‌గా ఆ ఇంటిపై దాడి చేసి కోట్లకుకోట్లు డ‌బ్బు ప‌ట్టుకోవ‌డం, అడ్డు వ‌చ్చిన వాడిని చిత‌క్కొట్ట‌డం చివ‌ర‌కు విల‌న్ ఎత్తుకు పై ఎత్తులు వేసి గెల‌వ‌డం క‌థ‌. సినిమా మొద‌టి ఐదు నిమిషాల్లోనే కోటిప‌ల్లికి చేర‌డం, హీరోయిన్ భాగ్యశ్రీ , క‌మెడియ‌న్ స‌త్య ఎంట్రీతో సినిమా గ్రాఫ్ అమాంతం పైకి లేచి ఇంట‌ర్వెల్ వ‌ర‌కు సాఫీగా దూసుకుపోయింది. 
 
ఈ క్ర‌మంలో హిందీ పాటలను ఉప‌యోగించిన తీరు బావుంది కానీ అవి అంద‌రికీ ఎక్కుతాయ‌న్న గ్యారెంటీ లేదు. ర‌వితేజ టైమింగ్‌, స‌త్య కామెడీ, భాగ్యశ్రీ అందం ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే బ్యాంగ్‌ ఫ‌స్టాఫ్‌ను ఓ స్థాయిలో నిల‌బెడ‌తాయి. 
 
సెకండాఫ్‌లో స్టార్ బాయ్, యూత్ యువ‌రాజ్ సిద్దు జొన్నలగడ్డ, గెస్ట్ అప్పీరియన్స్‌ కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించినా అది ఆ కొద్ది సేపే ఉంటుంది. అలాగే ఓ పాట‌లో సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ ప్ర‌సాద్ అలా మెరిపించి వెళ‌తాడు.
 
ఇక అస‌లు క‌థ సెకండాఫ్‌లో మొద‌లవ‌డం, బ‌చ్చ‌న్ టీమంతా విల‌న్ ఇంట్లోనే ఉండ‌డం, జంగ‌య్య త‌ల్లిగా అన్న‌పూర్ణ‌మ్మ ఎంట్రీ, ఆమె ల‌వ్ స్టోరీ, శుభ‌ల‌గ్నం సినిమాలోని అలీ పాత్ర‌ను ఆద‌ర్శంగా తీసుకుని ద్వితీయార్దంలో చ‌మ్మ‌క్ చంద్ర పాత్రను పెట్టి ఆ ఇంట్లోనే రిహార్ష‌ల్ చేయ‌డం, జ‌బ‌ర్ద‌స్త్ రోహిణి ఇలా ఒక‌టి రెండు క్యారెక్ట‌ర్ల ఎంట్రీతో సినిమా గాడి త‌ప్పిన‌ట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాలో ఎమోష‌న‌ల్ పాయింట్ మిస్స‌యింది. 
 
ఎదురుప‌డిన‌ ప్ర‌తీసారీ విల‌న్‌పై పైచేయి సాధించ‌డం.. సీఎం, పీఎంల‌ను సైతం ప‌ట్టించుకోక పోవ‌డం జ‌నాల‌కు అంత‌గా ఎక్కదు. బ‌చ్చ‌న్ టీం అధికారులు విల‌న్‌కు అనుకూలంగా ఉండ‌డం, డ‌బ్బు కాజేద్దామ‌నుకోవ‌డం అస‌లు అత‌క‌లేదు. 
 
ప్ర‌తీ స‌న్నివేశం స‌గ‌టు ప్రేక్ష‌కుడు ముందే అంచ‌నా వేసే విధంగా ఉండ‌డంతో చూసే వారికి ఆస‌క్తి త‌గ్గింది. విల‌న్‌కు, హీరో మ‌ధ్య సీన్లు బ‌లంగా లేక‌పోవడం, ఎలాంటి ట్విస్టులు లేక‌పోవ‌డం కొన్ని సీన్లూ ల్యాగ్ అనిపిస్తూ సెకండాఫ్‌ను అమాంతం పడిపోయేలా చేశాయి.
 
ఇక ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే..  
సినిమా అంతా మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు ర‌వితేజ మ‌యంగా క‌నిపిస్తుంది. ప్రేక్ష‌కులు ర‌వితేజ‌ను ఎలా చూడాలనుకుంటారో హ‌రీశ్ శంక‌ర్ అలానే చూపించి స‌క్సెస్ అయ్యారు కూడా. కానీ ఆయ‌న క్యారెక్ట‌ర్ ముందు ఇత‌ర పాత్ర‌ల‌న్నీ తేలిపోయాయి. 
 
ఉన్నంత‌లో భాగ్య‌శ్రీ అందం, అమాయ‌క‌పు న‌ట‌న‌, పాట‌ల్లో ఒల‌క‌బోసిన గ్లామ‌ర్‌, డ్యాన్స్ పెద్ద ఎస్సెట్‌. ఆత‌ర్వాత స‌త్య కామెడీ ఫ‌స్టాఫ్‌ను నిల‌బెట్ట‌గా సినిమా మొత్తానికి మిక్కీ జే మేయ‌ర్ సంగీతం చాలా బ‌లాన్ని చేకూర్చింది. 
 
ఆయ‌న అందించిన పాట‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక టెక్నిక‌ల్ ప‌రంగా కూడా ఎలాంటి వంక‌లు పెట్టాల్సిన అవ‌స‌రం లేదు. కాకపోతే.. దర్శకుడు హరీశ్ శంకర్ టేకింగ్ బావుండి సినిమాను స్పీడుగా న‌డిపించిన‌ప్ప‌టికీ సెకండాఫ్‌ కథపై దృష్టిపెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి.. క్వాలిటీ విషయంలో ఖ‌ర్చుకు ఎక్క‌డా వెన‌కాడ‌లేదు.
 
ట్యాగ్‌లైన్‌: ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌’.. మ్యాజిక్ మిస్స‌య్యన్