సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By preethi
Last Updated : బుధవారం, 5 సెప్టెంబరు 2018 (11:15 IST)

నాని "దేవదాసు"కు బిగ్‌బాస్ చిక్కులు... సినిమాను బహిష్కరించనున్నారా..?

బిగ్‌బాస్ సీజన్ 2 ముగియడానికి ఇంకా కొద్ది రోజులే ఉన్నందున అటు హౌస్‌లోనే కాకుండా బయట కూడా ఉత్కంఠభరితమైన పరిస్థితులు నెలకొన్నాయి. హౌస్‌మేట్స్‌తో పాటు ఈ ప్రభావం హోస్ట్ నానిపై కూడా పడుతోంది. ఈ షో ముందే స్

బిగ్‌బాస్ సీజన్ 2 ముగియడానికి ఇంకా కొద్ది రోజులే ఉన్నందున అటు హౌస్‌లోనే కాకుండా బయట కూడా ఉత్కంఠభరితమైన పరిస్థితులు నెలకొన్నాయి. హౌస్‌మేట్స్‌తో పాటు ఈ ప్రభావం హోస్ట్ నానిపై కూడా పడుతోంది. ఈ షో ముందే స్క్రిప్ట్ చేయబడిందని, దాని ప్రకారమే నడుస్తోందని, ప్రజల ఓట్లతో ఏమాత్రం సంబంధం లేదని, ఇందులో నాని కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారని కొంతమంది నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు.
 
నూతన్ ఎలిమినేట్ అయిన తర్వాత చాలామంది ఈ వాదనను సమర్థిస్తున్నారు. అంతేకాకుండా గీత, తనీష్‌లను చివరిదాకా కొనసాగించాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నారు కాబట్టే టాస్క్‌లో భాగంగా వారికి నామినేషన్ నుండి రక్షణ కల్పించి, ఒకరిని సీజన్ మొత్తం నామినేట్ చేసే అవకాశం గీతకు ఇచ్చారు. ఆమె సెకండ్ థాట్ లేకుండానే కౌషల్‌ను నామినేట్ చేసారు. ఇదంతా వీరి వాదనకు బలం చేకూరుస్తోంది.
 
షో హోస్ట్ నానిపై కూడా కొందరు ఈ విషయంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన నటిస్తున్న ‘దేవదాసు’ చిత్రాన్ని బహిష్కరిస్తామంటూ ప్రకటిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితులలో నాని స్పందించారు. ‘‘బిగ్‌బాస్‌కు సంబంధించి ప్రజల నుండి కొన్ని రిప్లైలు చూశా. వీటికి నేను సమాధానం ఇవ్వనని భావించారు. కానీ, స్పందించకుండా ఎలా ఉంటాను? ఇదే నా చివరి రిప్లై’’ అని ఓ లేఖను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు.
 
‘‘మీలో కొందరికి బాధ కలిగినట్లయితే నన్ను క్షమించాలి.. కానీ, మీ ఆలోచన ప్రకారం.. మీకు నచ్చిన హౌస్‌మేట్‌ను ప్రతిసారి చాలా ప్రత్యేకంగా ట్రీట్ చేయాలని మీరు భావిస్తారు. కానీ, హోస్ట్‌గా నేను హౌస్‌లో ఉన్న అందరినీ సమానంగా చూడాలి. ఎందుకంటే హౌస్‌మేట్స్‌లో మీకు ఎవరో ఒకరు నచ్చే ఉంటారు, దీంతో నేను అందరినీ ఒకేలా చూసేటప్పటికి మీకు అది నేను ఎవరో ఒకరిని సమర్థిస్తున్నట్లు కనిపిస్తోంది. 
 
కానీ, నాకు అంతా సమానమే. హౌస్‌లో ఉత్తమంగా ఎవరైతే ఉంటారో వాళ్లే మీ మద్దతుతో గెలుస్తారు, అది ఓటింగ్ కావచ్చు లేదా ఎలిమినేషన్ కావచ్చు, ఆ నిర్ణయం మీదే. ఒక నటుడిగా, హోస్టుగా.. నా బెస్ట్ ఇస్తా. చివరిగా.. నన్ను ప్రేమించినా, ద్వేషించినా.. మీరంతా నా ఫ్యామిలీయే. మీరు అపార్థం చేసుకుంటే ఆ ప్రభావం నా మీద పడుతుంది. దీని వలన నేను కుంగిపోతానా? కాదు కదా, ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తాను’’ అని లేఖలో పేర్కొన్నాడు నాని.