మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ivr
Last Modified: మంగళవారం, 6 మార్చి 2018 (18:08 IST)

రజినీకాంత్ చెప్పిన ధర్మరాజు-దుర్యోధనుడు కథ... ఎందుకు?

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ నిన్న ఎంజీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ... తమిళనాడు ముఖ్యమంత్రుల్లో

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ నిన్న ఎంజీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ... తమిళనాడు ముఖ్యమంత్రుల్లో ఎంజీఆర్ దేవుడు లాంటి మనిషని కొనియాడారు.  ముఖ్యమంత్రుల్లో దేవుడు ఎంజీఆర్ అనీ, అమ్మ జయలలిత కూడా వెళ్లిపోయారనీ, ఇక ఉద్దండుల్లో ఒకరైన కరుణానిధి అనారోగ్యంతో వున్నారని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అనిశ్చితిలో వున్నాయని అన్నారు. అందువల్ల తమిళనాడుకు ఇప్పుడు సరైన నాయకుడు కావాల్సి వుందని అభిప్రాయపడ్డారు. 
 
రాజకీయాలంటే అంత సామాన్యమైన విషయం కాదని తనకు తెలుసునని అన్నారు. రాజకీయాల్లో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయనీ, అవన్నీ అడ్డుకుని ఎంజీఆర్ స్థాయిలో పాలన ఇవ్వగల సత్తా అయితే తనకు వున్నదంటూ వెల్లడించారు. ఇక విద్యార్థుల గురించి చివరిగా ఓ మాట చెపుతానంటూ మహాభారతం లోని ఓ విషయాన్ని చెప్పారు.
 
ద్రోణాచార్యుడు ఒకరోజు దుర్యోధనుడు-ధర్మరాజులను పిలిచాడు. దుర్యోధనుడితో... శిష్యా దుర్యోధనా... నేను ఓ యజ్ఞం చేయబోతున్నాను. దానికి 10 మంది మంచివాళ్లు కావాలి, వెతికి తీసుకునిరా అని చెప్పి పంపాడు. ఆ తర్వాత ధర్మరాజును పిలిచి... ధర్మరాజా... యజ్ఞం చేయడానికి నాకు 10 మంది చెడ్డవాళ్లు కావాలి, వెతికి వెంటబెట్టుకునిరా అని చెప్పాడు. ధర్మరాజు సరేనంటూ వెళ్లిపోయాడు. సాయంత్రానికి దుర్యోధనుడు ఒంటరిగా ద్రోణాచార్యుడి వద్దకు వచ్చాడు. ఏంటి దుర్యోధనా... ఎవరూ లేరేమి అని అడిగాడు ద్రోణాచార్యుడు. 
 
అప్పుడు దుర్యోధనుడు... ఎంత వెతికినా మంచివాళ్లు తనకు కనబడలేదన్నాడు. అంతా చెడ్డవాళ్లే కనబడ్డారని చెప్పాడు. ఇంతలో ధర్మరాజు కూడా ఒంటరిగానే వచ్చాడు. ద్రోణాచార్యుడు ప్రశ్నించాడు. దానికి ధర్మజుడు, తనకు ఒక్క చెడ్డవాడు కూడా కనబడలేదనీ, అంతా మంచివారే కనబడ్డారని వెల్లడించాడు. దీన్నిబట్టి తెలిసేదేమిటంటే... దుర్యోధనుడు దృష్టి అంతా చెడువైపే వుంటుంది కనుక అతడికి మంచి కనబడలేదు.... అలాగే ధర్మజుడికి మంచి తప్ప చెడు కనిపించలేదు. 
 
కాబట్టి విద్యార్థులు కూడా అంతా మంచివైపు చూస్తూ తమ కెరీర్ మలచుకోవాలంటూ చెప్పారు సూపర్ స్టార్ రజినీకాంత్.