శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : శనివారం, 9 జనవరి 2021 (15:34 IST)

ఆంధ్రప్రదేశ్: పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం వీలుపడదు, జగన్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నడుమ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి నాలుగు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. అయితే, కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించడం వీలుకాదని ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు.

 
‘‘ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాదనతో మేం విభేదిస్తున్నాం. నిజానికి మొదట ఎన్నికలను వాయిదా వేసింది ఎన్నికల కమిషనే’’ అని లేఖలో ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

 
ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు..
‘‘కోవిడ్-19 కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఎన్‌డీఎంఏ)ను విధించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను మేం అనుసరిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ కష్టం’’ అని ఆదిత్యనాథ్ తెలిపారు. ‘‘రాష్ట్ర ప్రజలు ఒకవైపు కరోనావైరస్‌తో సతమతం అవుతుంటే మరోవైపు ఎన్నికలు నిర్వహించడం లేదని వ్యాఖ్యానించడం శోచనీయం. అనధికార సమాచార ప్రసార మార్గాలను రాజ్యాంగ సంస్థలు ఉపయోగించడం తగ్గించాలని మేం భావిస్తున్నాం’’.

 
‘‘ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఇదివరకే సుప్రీం కోర్టు సూచించింది. కరోనావైరస్ కేసులు పెరగడంతో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం కష్టమని మేం కూడా సూచించాం. కానీ ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోకుండానే షెడ్యూల్ విడుదల చేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

 
‘‘ప్రస్తుతం అధికారులంతా కోవిడ్-19 వ్యాక్సీన్ కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం వీలుపడదు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల విషయంలో రాష్ట్రం నిబద్ధతతో కట్టుబడి ఉందని మేం పునరుద్ఘాటిస్తున్నాం. అయితే.. కరోనా వ్యాప్తి నడుమ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి’’ అని ఆయన అన్నారు.

 
నిమ్మగడ్డ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ముందు కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం ఆయనతో ఆదిత్యనాథ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ భేటీ అయ్యారు. ఎన్నికలు ప్రస్తుతం నిర్వహించలేమని వీరంతా నిమ్మగడ్డకు తెలియజేశారు. అయితే, కోర్టు ఆదేశాలు, నిబంధనల మేరకు నడుచుకుంటానని చెబుతూ షెడ్యూల్‌ను నిమ్మగడ్డ విడుదల చేశారు.