బంగారం పరుగులు.. 10 గ్రాముల పసిడి రూ.90 వేలు.. కిలో వెండి రూ.లక్ష దాటేశాయి...
దేశీయంగా బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. ఫలితంగా దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.90 వేలు దాటింది. అలాగే, కిలో వెండి ధర లక్ష దాటేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది.
దేశీయ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల బంగారం ధర తొలిసారి రూ.90 వేల మార్క్‌కు చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల బంగారం ధర తొలిసారి రూ.90 వేలు దాటింది. ధర పెరుగుదలో పసిడితో పోటీపడుతున్న వెండి ధర రూ.1.03 లక్షలకు చేరుకుంది.
అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మొదలైన వాణిజ్య యుద్ధానికి తోడు, పలు దేశాలపై సుంకాలు పెంచుతామన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. అది అంతిమంగా బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
అమెరికాలోనూ ఆర్థిక మందగమనం తప్పదన్న ఊహాగానాల నేపథ్యంలో మదుపర్లు బంగారంపై పెట్టుబడులు భారీగా పెడుతున్నారు. దీంతో బంగారం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు మేలిమి బంగారం ధర రూ.2983 డాలర్లకు చేరింది. దీంతో దేశీయ మార్కెట్‌లోనూ ధరలు పెరిగి పది గ్రాముల స్వచ్ఛమైన ధర రూ.90,450కి చేరింది.