శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (20:17 IST)

ముంబై డబ్బావాలాలకు కరోనా దెబ్బ.. బతుకులు మారుతాయా?

Mumbaiwala
ముంబై డబ్బావాలాలకు కరోనా దెబ్బ తప్పలేదు. ముంబైలో కరోనా విజృంభిస్తోన్న తరుణంలో.. ఈ వైరస్ ధాటికి డబ్బావాలాల జీవితాలు జబ్బు పడ్డాయి. 130 ఏళ్లుగా లంచ్‌బాక్సులు సరఫరా చేస్తూ బతికేస్తున్న ఈ డబ్బావాలాలను కరోనా పెద్ద దెబ్బే కొట్టింది. ముంబైలో డబ్బావాలా సేవలు ఆరు నెలలుగా నిలిపేశారు. ఈ పరిస్థితుల్లో సెప్టెంబరులో ''మిషన్ బిగిన్ ఎగైన్" అని మహారాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. 
 
పది శాతం ఉద్యోగులతో ప్రైవేటు కంపెనీలు నడుపుకోవడానికి అనుమతిచ్చింది. ఈ ''మిషన్ బిగిన్ ఎగైన్" తమ బతుకులను మాత్రం మార్చలేకపోయిందని డబ్బావాలాలు అంటున్నారు. సెప్టెంబరులో తమ సేవలు ప్రారంభమైనా ఎటువంటి ప్రయోజనం లేకపోయిందని వాపోతున్నారు.
 
లాక్‌డౌన్ కారణంగా పనులు లేక, ఆదాయం లేక ఇబ్బందులు పడిన ఈ డబ్బావాలా బతుకులను నిసర్గ తుఫాను కూడా దెబ్బతీసింది. ఈ తుఫాను కారణంగా చాలామంది డబ్బావాలాల ఆహార నిల్వలు నీటిపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైనా డబ్బావాలాల జీవితాలు మాత్రం మారలేదు. కరోనా భయంతో ఈ సేవలు ఉపయోగించుకోవడానికి ప్రజలు ఆలోచిస్తున్నారు. తమ సేవలకు పూర్వవైభవం రావాలంటే చాలాకాలం పడుతుందని డబ్బావాలాలు బాధపడుతున్నారు. 
 
నెమ్మదిగా మహారాష్ట్ర మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటోంది. ప్రాంతాలవారీగా అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమవుతోంది. అయినాసరే తమ బతుకులు మాత్రం మారడం లేదని, తమ సేవలు వినియోగించుకునే వారి సంఖ్య చాలా తగ్గిపోయిందని, 130ఏళ్లలో ఎప్పుడూ తాము ఇలాంటి కష్టాలు ఎదుర్కోలేదని డబ్బావాలాలు వాపోతున్నారు.