ఆదివారం, 9 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2016 (13:24 IST)

జయలలిత మార్క్ పాలిటిక్స్... మిత్రులందరికీ షాక్... ఆచితూచి అడుగేస్తున్న అన్నాడీఎంకే!

గత శాసనసభ ఎన్నికల సందర్భంగా తమ కూటమిలో చేరిన మిత్రపక్షాలన్నింటినీ ముఖ్యమంత్రి జయలలిత బయటకు పంపేశారు. అప్పటి ఎన్నికల్లో తమ గెలుపులో కీలకపాత్ర పోషించినప్పటికీ, ఈ ఎన్నికల నాటికల్లా వాటితో పొత్తును కాదనుకున్నారు. ప్రధాన మిత్రపక్షంగా పోటీచేసిన విజయ్‌కాంత్‌ నాయకత్వంలోని డీఎండీకేను ఆ ఎన్నికలు ముగిసిన వెంటనే బయటకు పంపిన జయలలిత... తాజాగా శరత్‌కుమార్‌ నేతృత్వంలోని సమత్తువ మక్కల్‌ కట్చికి షాక్ ఇచ్చారు. 
 
పార్టీలో అయినా, కూటమిలో అయినా ఎల్లవేళలా తన మాటే నెగ్గాలనుకునే జయరాం జయలలిత అందులో ఏ మాత్రం తేడా వచ్చినా సహించరనేది తెలిసిన విషయమే. దానివల్ల తనకు ఎంత నష్టం వాటిల్లినా సరే లెక్కచేయని నైజంతో ముందుకు వెళతారనే విషయాన్ని మరోసారి చాటారు. 
 
1991 ఎన్నికల్లో మొదటిసారి జయలలిత ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతూనే ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్‌కు ఎదురైన అనుభవాన్ని 1998 లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలోని భాజపా సర్కారు కూడా రుచి చూసింది. తిరిగి 2001 శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్‌, పీఎంకేలకు కూడా ఇదే రకమైన అనుభవం ఎదురైంది. ఆ దెబ్బతో కాంగ్రెస్‌, పీఎంకేలు తిరిగి అన్నాడీఎంకే వైపు చూడలేని పరిస్థితి నెలకొనంది. 
 
కానీ, 2011 ఎన్నికల నాటికి డీఎండీకే మరో ప్రధాన పార్టీగా అవతరించింది. 2005లోనే ఆ పార్టీ తన బలాన్ని చాటుకోవడంతో 2011 ఎన్నికల్లో దానిని అన్నాడీఎంకే తమ కూటమిలోకి ఆహ్వానించింది. అప్పట్లో డీఎంకే పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగా కెప్టెన్‌ ఆ కూటమిలో చేరినప్పటికీ, ఎన్నికలు ముగిసిన వెంటనే జయ దెబ్బకు కెప్టెన్ కుదేలయ్యారు. మిత్రపక్షంగానే ఉన్నప్పటికీ తమ పార్టీ శాసనసభాపక్షాన్ని నిలువునా చీల్చడాన్ని విజయ్‌కాంత్‌ జీర్ణించుకోలేకపోయారు. ఈ కారణంగానే 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పవనాలను సొమ్ము చేసుకునేలా పీఎంకే, భాజపా, ఎండీఎంకేలతో కలిసి, కొత్త కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. 
 
అయితే ఆ పార్టీల మధ్య భావసారూప్యత లేక పోవడం, డీంఎకే కూటమి బలహీనంగా ఉండడంతో అన్నాడీఎంకేకు బాగా కలసివచ్చింది. మరో రెండు నెలల్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్న తరుణంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలతి మరోమారు తన మార్కు రాజకీయంతో ముందుకు సాగుతున్నారు. ఇందులోభాగంగా మిత్రులందరినీ బయటకు పంపుతున్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో ఫార్వర్డ్ బ్లాక్ మాత్రమే మిగిలివుంది. మున్ముందు ఈ పార్టీకి కూడా ఎలాంటి షాక్ ఇస్తారో వేచి చూడాల్సిందే.