ఆ ఎమోజీని వాడకండి.. ఫత్వా జారీ చేసిన మత బోధకుడు
సోషల్ మీడియాలో ఎమోజీలు వాడటం సాధారణమే. కానీ మత బోధకుడు ఎమోజీలో ఉన్న ఒకదానిని వాడొద్దని ఏకంగా ఫత్వా జారీ చేయడం దుమారం రేగుతోంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిపై కొంతమంది సానుకూలంగా స్పందించగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌కు చెందిన ఇస్లాం మత బోధకుడు అహ్మదుల్లా. ఈయన సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఈయనకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఫేస్ బుక్, యూ ట్యూబ్ లలో ఆయనకు 30 లక్షల మంది ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు.
మతపరమైన అంశాలను చర్చించేందుకు టెలివిజన్ షోలో కనిపిస్తుంటారు. ఈ క్రమంలో ఫేస్ బుక్ లో ప్రజలను ఎగతాళి చేయడంపై చర్చించారు. ఇలా చేయడం నిషేధమని, ప్లాట్ ఫాం ఫేస్ బుక్ లో వెక్కిరింతగా ఉండే 'హహ్హా' ఎమోజీని వాడొద్దని సూచించారు. ఫత్వాను జారీ చేస్తున్నామన్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.