శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (07:56 IST)

భారతీయ కొత్త ఐటీ కొత్త నిబంధనలకు తలొగ్గిన ట్విట్టర్...

ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలపై ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తొలుత బెట్టు చేసినప్పటికీ చివరకు తలొగ్గింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ విధానాలను అంగీకరిస్తున్నట్టు తెలిపింది. 
 
చట్టం ప్రకారం ప్రభుత్వానికి, తమ సంస్థకు మధ్య అనుసంధానకర్తగా ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కొత్త ఐటీ నిబంధనలను ఇప్పటికే ఫేస్‌బుక్ సహా అన్ని ఓటీటీ సంస్థలు అంగీకరించాయి.
 
ట్విట్టర్ మాత్రం తొలుత ససేమిరా అన్నప్పటికీ... ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు తెరపైకి వచ్చాయి. మార్గదర్శకాలను పాటించేందుకు మే 25 వరకు కేంద్రం గడువిచ్చింది. 
 
దీంతో అన్ని సంస్థలు కేంద్ర నిబంధనలను అంగీకరించాయి. ట్విట్టర్ ఒప్పుకోకపోయేసరికి... ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని ట్విట్టర్ కార్యాలయాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీంతో, ట్విట్టర్ స్పందిస్తూ దీన్ని వాక్ స్వాతంత్ర్యంపై జరుగుతున్న దాడిగా పేర్కొంది.
 
ట్విట్టర్ వ్యాఖ్యలతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంపై ట్విట్టర్ తన వైఖరిని రుద్దే ప్రయత్నం చేస్తోందని... దేశాన్ని అపఖ్యాతిపాలు చేస్తోందని వ్యాఖ్యానించింది. ఈ దేశ చట్టాలకు లోబడే ట్విట్టర్ పని చేయాలని వార్నింగ్ ఇచ్చింది. దీంతో, ట్విట్టర్ దారిలోకి వచ్చింది.