ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (10:02 IST)

కెనడా - మెక్సికో - చైనాలకు షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్!!

donald trump
తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కెనడా, మెక్సికో, చైనా దేశాలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తేరుకోలేని షాకిచ్చారు. తాము అధికారంలోకి వస్తే కొన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు విధిస్తామంటూ ప్రకటనలు చేశారు. వీటిని ఇపుడు ఆయన ఆచరణలో పెడుతున్నారు. అమెరికా పౌరులకు మేలు చేకూర్చే ఎలాంటి కష్టతరమైన నిర్ణయాన్ని అమలు చేయడంలో ఆయన ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అందులోభాగంగానే కెనడా, మెక్సికో దిగుమతులతో పాటు చైనా పై సుంకాలు విధిస్తానంటూ పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా ఆ హెచ్చరికలను నిజం చేశారు. ఆయా సుంకాలు విధించే ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. 'నేడు కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాల అమలుకు సంతకం చేశాను. ఫెంటనిల్‌తో సహా మా దేశ పౌరులను చంపే చట్టవిరుద్ధమైన, ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాల ముప్పు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. మాకు అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉంది. అందరికీ భద్రత కల్పించడం అధ్యక్షుడిగా నా బాధ్యత. చట్టవిరుద్ధ వలసదారులను, మాదక ద్రవ్యాలు మా సరిహద్దుల్లోకి రాకుండా చేస్తానని ఎన్నికల ప్రచారంలో మాటిచ్చాను. ఆ మాటకు కట్టుబడి ఉన్నా' అని తన సోషల్‌ మీడియా పోస్టులో పేర్కొన్నారు.