మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (13:43 IST)

ఆ టీకాతో హెచ్.ఐ.వి. ముప్పు.. సౌతాఫ్రికా ప్రకటన

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సోకకుండా, ఒక వేళ సోకినా ప్రాణ నష్టం సంభవించకుండా ఉండేందుకు వీలుగా పలు ప్రపంచ దేశాలు టీకాలను అభివృద్ధి చేశారు. ఇలాంటి దేశాల్లో రష్యా ఒకటి. ఈ దేశం స్పుత్నిక్ పేరుతో ఓ టీకాను తయారు చేసింది. అయితే, ఈ టీకా వేసుకుంటే హెచ్.ఐ.వి ముప్పు అధికంగా ఉన్నట్టు దక్షిణాఫ్రికా ఔషధ నియంత్రణ సంస్థ సంచలన ప్రకటన చేసింది. 
 
అడినోవైరస్ టైప్ 5 వెక్టార్లతో హెచ్ఐవీ ముప్పు ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయని, ఈ నేపథ్యంలోనే అదే వెక్టార్‌తో తయారైన స్పుత్నిక్ వ్యాక్సిన్ వల్ల పురుషుల్లో హెచ్ఐవీ ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, కాబట్టి రష్యా వ్యాక్సిన్‌ను అనుమతించలేమని దక్షిణాఫ్రికా ఔషధ నియంత్రణ సంస్థ గత సోమవారం తేల్చి చెప్పింది. 
 
దానికి సంబంధించిన డేటానూ రష్యా సమర్పించలేదని, ఆ డేటాను అందజేశాక టీకా అనుమతులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా ప్రకటనతో ఆఫ్రికా దేశమైన నమీబియా స్పుత్నిక్ వ్యాక్సిన్లను తాత్కాలికంగా నిలిపేసింది. ఇప్పటికే అక్కడ జనానికి స్పుత్నిక్ టీకాలు ఇస్తున్న ఆ దేశం.. మధ్యలోనే ఆపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నమీబియా ఆదివారం ప్రకటన చేసింది.