బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (18:55 IST)

హోటళ్లలో సీక్రెట్ కెమెరాలతో తీసిన వీడియోలు ప్రత్యక్ష ప్రసారం

హోటళ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి దాదాపు 1600 మంది వీడియోలను చిత్రీకరించారు. అంతటితో ఆగకుండా వాటిని ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసారు. దక్షిణకొరియాలో భారీ స్పై కామ్‌ల కుంభకోణం తాజాగా వెలుగుచూసింది. గతేడాది నవంబరు నుంచి ఈ ఘటనలు జరిగాయి. 
 
అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణకొరియా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 10 నగరాల్లోని 30 హోటళ్లలో గల 42 గదుల్లో నిందితులు సీక్రెట్‌ కెమెరాలను అమర్చి గెస్ట్‌ల వీడియోలను రికార్డు చేశారు. 
 
టీవీ బాక్సులు, వాల్‌ సాకెట్లు, హెయిర్‌ డ్రయర్‌ హోల్డర్లలో వీటిని పెట్టి వీడియోలను ప్రత్యక్ష ప్రసారం చేసారు. ఈ వీడియోలను ఆన్‌లైన్‌లో 4వేల మందికి పైగా వీక్షించారు. కొందరు డబ్బులు చెల్లించి మరీ రీప్లే చేయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 
 
ఈ ఘటనకు సంబంధించి మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ కుంభకోణం ఎలా బయటపడిందన్న విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఈ కుంభకోణంలో హోటల్‌ యాజమాన్యం ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
దక్షిణకొరియాలో ఇలా సీక్రెట్‌ కెమెరాల కుంభకోణాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. అయితే వాటిని ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడం మాత్రం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు. 2017 సంవత్సరంలో రహస్య కెమెరాలతో వీడియోల చిత్రీకరణపై 6,400 కేసులు నమోదయ్యాయి. 
 
దీనిపై దేశవ్యాప్తంగా గతేడాది పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. ‘నా జీవితం నీ అశ్లీలం కాదు’ అన్న పేరుతో వేలాది మంది మహిళలు ఆందోళన చేపట్టినప్పటికీ ఈ ఆగడాలు ఆగట్లేదు.