మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2024 (15:26 IST)

భారత్‌కు పన్నుపోటు తప్పదు : హెచ్చరించిన డోనాల్డ్ ట్రంప్

Donald Trump
భారత్‌కు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. భారత్‌కు పన్నుపోటు తప్పదని సంకేతాలు పంపించారు. అమెరికా ఉత్పత్తులపై న్యూఢిల్లీ అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తోందని ఆరోపించారు. దీనికి ప్రతీకార పన్ను తప్పదంటూ ఆయన తాజాగా హెచ్చరించారు. 
 
ఫ్లోరిడాలోని తన ఎస్టేట్ విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, 'అమెరికా ఉత్పత్తులపై భారత్, బ్రెజిల్ వంటి దేశాలు అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్నాయి. 100, 200 శాతం పన్నులు వేస్తున్నాయి. దేనికైనా ప్రతిచర్య ఉంటుంది. వాళ్లు మాపై పన్నులు విధిస్తే మేమూ అంతేస్థాయిలో పన్నులు వసూలు చేస్తాం. ఒకవేళ భారత్ 100 శాతం పన్నులు విధిస్తే మేము వారిపై అలాగే ఛార్జ్ చేయకూడదా? ఆయా దేశాలు సుంకాలు వసూలుచేయడం అనేది వారి ఇష్టమే. కానీ, మేం కూడా అలాగే స్పందిస్తాం" అని ట్రంప్ వివరించారు.
 
అధ్యక్ష ఎన్నికలకు ముందు కూడా ట్రంప్ పలుమార్లు సుంకాల అంశంపై ఇదేతరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అత్యధిక సుంకాలు విధిస్తానని గతంలోనూ హెచ్చరించారు. తాజా వ్యాఖ్యలతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనిపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.