బ్రిస్బేన్‌లో టీమిండియాను కాపాడిన వరుణుడు!!
బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టును ఓటమి నుంచి వరుణ దేవుడు రక్షించాడు. బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా, గబ్బా స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో 275 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ టీ విరామ సమయానికి 8-0 పరుగులతో నిలిచింది. ఆ సమయంలో ఆటకు తీవ్ర అంతరాయం కలగడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగిస్తున్నట్టు ఇరు జట్ల కెప్టెన్లు, ఫీల్డు అంపైర్లు ప్రకటించారు.
కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 445 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 89/7 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని టీమిండియాకు 275 పరుగుల విజయలక్ష్యాన్ని ఆస్ట్రేలియా నిర్ధేశించింది.
మరోవైపు, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులు చేసి అలౌట్ అయింది. ఆ తర్వాత ఆసీస్ నిర్దేశించిన 275 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. కానీ వరుణ దేవుడు ఆటంకం కలిగించడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.