ఆదివారం, 14 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 ఆగస్టు 2025 (21:57 IST)

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

Pen Cap in Lung
Pen Cap in Lung
ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి వైద్యులు అసాధారణ విషయాన్ని సునాయాసంగా ఆపరేషన్ ద్వారా సాధించారు. 33 ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తుల నుండి ప్లాస్టిక్ పెన్ క్యాప్‌ను విజయవంతంగా తొలగించారు. ఆ వస్తువు 26 సంవత్సరాలుగా అక్కడే ఉంది. ఈ రోగి కేవలం 7 సంవత్సరాల వయసులో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పెన్ క్యాప్‌ను మింగేశాడు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఊపిరితిత్తుల్లో ఇన్నేళ్ల పాటు పెన్ క్యాప్ వున్నా.. ఎలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోలేదు. అయితే, ఇటీవల, అతను నిరంతర దగ్గుతో బాధపడటం ప్రారంభించాడు. అతని కఫంలో రక్తం జాడలను గమనించాడు. 
 
వెంటనే వైద్యులను కలిసాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు, వాటిలో ఎక్స్-రే కూడా ఉంది. ఇది అతని ఊపిరితిత్తులలో క్యాప్ వుందని తెలిసింది. ఆపై వెంటనే సర్ గంగా రామ్ హాస్పిటల్‌లోని థొరాసిక్ సర్జరీ చైర్‌పర్సన్ డాక్టర్ సబ్యసాచి బాల్ నేతృత్వంలోని థొరాసిక్ సర్జరీ బృందం ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకుంది. శస్త్రచికిత్స సమయంలో, పెన్ క్యాప్ చెక్కుచెదరకుండా ఉండటం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. 26 సంవత్సరాల తర్వాత దానిని విజయవంతంగా తొలగించారు.
 
ఆసుపత్రిలోని థొరాసిక్ సర్జరీ విభాగంలో కన్సల్టెంట్ డాక్టర్ రోమన్ దత్తా మాట్లాడుతూ ఇది చాలా అరుదైన కేసు అని అన్నారు. "ప్రాణాంతక సమస్యలు లేకుండా ఇంత కాలం ఊపిరితిత్తులలో క్యాప్ ఉండటం చాలా అసాధారణం. కానీ అలాంటి కేసులు కాలక్రమేణా ప్రమాదకరంగా మారవచ్చు. ఇది ఇన్ఫెక్షన్లు, రక్తస్రావం లేదా ఇతర తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది" అని ఆయన వివరించారు.