మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వాసు
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (12:31 IST)

పుల్వామా ఉగ్రదాడి : సాక్ష్యాలు అందించిన జైషే

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తమపని కాదంటూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు తమ సొంత గూటి పక్షులే అయిన జైషే మహమ్మద్ గట్టి ఝలక్ ఇచ్చింది. ఆయన అడుగుతున్న ఆధారాలను వీడియో రూపంలో బయటపెట్టింది. తనకు తానుగా సాక్ష్యాలను అందజేసింది. పుల్వామా ఉగ్రదాడి తమ పనేనని పేర్కొంటూ మంగళవారం రెండో వీడియోను విడుదల చేసింది. అయితే అక్కడితో ఆగకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు దాడి చేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని వీడియోలో పేర్కొనడం ఇక్కడ గమనించదగ్గ విషయం. 
 
వివరాలలోకి వెళ్తే... మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పుల్వామా ఉగ్రదాడికీ తమకూ ఎలాంటి సంబంధంలేదని పేర్కొంటూ భారత్ వాదనలను కొట్టిపడేయడంతోపాటు తమ దేశం కూడా స్వయంగా ఉగ్ర బాధిత దేశమేనని వాపోతూ తమపై నిందలు వేస్తున్న భారత్.. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి రుజువులు ఉంటే చూపాలని పదే పదే కోరడం జరిగింది. 
 
అయితే... ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే జైషే... ఈ దాడులు తమ పనేనని పేర్కొంటూ రెండో వీడియోని విడుదల చేయడం జరిగింది. ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించి.. భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి..
 
మరి సాక్ష్యాలు తమంతట తామే బయటకొచ్చిన ఈ సందర్భంలో పాక్... జైషే సూత్రధారిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణించనివ్వకుండా పాక్‌కి మద్దతు ఇస్తున్న చైనా ఎలా స్పందించనున్నాయో వేచి చూద్దాం.