ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 మార్చి 2024 (10:37 IST)

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : డోనాల్డ్ ట్రంప్ - జో బైడెన్ నామినేషన్లు ఖరారు!!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి డెమోక్రాటిక్ పార్టీ తరపున జో బైడెన్ నామినేషన్ ఖరారైంది. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సివుంది. అలాగే, రపబ్లికన్ పార్టీ తరపున డోనాల్డ్ ట్రంప్ నామినేషన్ ఖరారైంది. 
 
తాజాగా జరిగిన జార్జియా ప్రైమరీలో జో బైడెన్ గెలుపొందారు. దీంతో పార్టీ నుంచి నామినేట్‌ కావడానికి అవసరమైన 1,968 మంది ప్రతినిధులను సంపాదించుకున్నారు. వాషింగ్టన్‌, మిస్సిసిపీ, నార్తర్న్‌ మరియానా ఐలాండ్స్‌లోనూ ఆయన విజయం ఖాయమని పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.
 
'ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇప్పుడు ఓటర్ల ముందు ఉంది. ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా? లేదా దాన్ని కూల్చివేసేందుకు ఇతరులకు అనుమతి ఇస్తారా? మన స్వేచ్ఛను, భ్రదతను కాపాడుకునే హక్కును పునరుద్ధరిస్తారా? లేదా వాటిని లాక్కునేవారికి అవకాశమిస్తారా?' అని జార్జియాలో విజయం తర్వాత తన మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్‌ అన్నారు.
 
అదేవిధంగా, రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్థిత్వం సైతం ఖరారైంది. తాజాగా వాషింగ్టన్‌లోనూ విజయం సాధించారు. దీంతో నామినేషన్‌కు కావాల్సిన ప్రతినిధుల మద్దతు లభించింది. బుధవారం వెలువడనున్న మరికొన్ని ప్రైమరీల్లోనూ ఆయన విజయం ఖాయంగానే కనిపిస్తోంది. చివరివరకు పోటీగా నిలిచిన నిక్కీ హేలీ సైతం రేసు నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. దీంతో బైడెన్‌, ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడనున్నారు.