బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 మే 2020 (14:28 IST)

కాశ్మీర్‌లో వేలెట్టం... అది మా విధానం కాదు : తాలిబన్

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న కాశ్మీర్ అంశంపై తాలిబన్ తీవ్రవాద సంస్థ తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్టు స్పష్టం చేసింది. కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. పైగా, ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చే ఉద్దేశ్యం తమకు ఎంతమాత్రం లేదని, అస్సలు అది తమ విధానం కాదని విస్పష్టం చేసింది. 
 
కాశ్మీర్ జీహాద్‌లో తాలిబన్ చేరిపోతుందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిపై తాలిబన్ తీవ్రవాద సంస్థ ప్రతినిధి సుహేల్ షహీన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. కాశ్మీర్ జీహాద్‌లో తాలిబన్ చేరిపోతుందంటూ వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవం. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదనేది ఇస్లామిక్ అమిరాత్ స్పష్టమైన విధానం అని ఆయన తేల్చి చెప్పారు. 
 
తాలిబన్ల రాజకీయ విభాగంగా అఫ్ఘాన్ ఇస్లామిక్ అమిరాత్ ప్రకటించుకుంది. కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా భారత్‌తో స్నేహం అసాధ్యమని, కాబూల్‌లో అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత కాశ్మీర్‌ను కాఫిర్ల నుంచి విముక్తం చేస్తామని తాలిబన్ ప్రతినిధిగా చెప్పుకునే జబీవుల్లా ముజాహిద్ పేరిట వచ్చిన ప్రకటన వచ్చింది. ఇది సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. దీంతో సుహేల్ షపీన్ ఓ ట్వీట్ చేస్తూ, కాశ్మీర్ అంశంలో తమ వైఖరిని తేటతెల్లం చేశారు.