సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (16:46 IST)

ఇమ్రాన్ ఖాన్ పేరును ఎగ్జిట్ కంట్రోల్ లిస్టులో చేర్చాలి : హైకోర్టులో పిటిషన్

imran khan
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస పరీక్షను ఎదుర్కొని పదవీచ్యుతుడైన ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ దేశం విడిచి వెళ్లిపోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఇమ్రాన్ పేరును ఎగ్జిట్ కంట్రోల్ జాబితాలో చేర్చాలంటూ పిల్ దాఖలు చేశారు. దీంతో పాక్ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరిగాయి. 
 
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు దేశాన్ని వీడే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన పేరును ఎగ్జిట్ కంట్రోల్ జాబితాలో చేర్చాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ జాబితాలో పేరు చేరితే ఆ వ్యక్తులు దేశాన్ని వదిలి వెళ్లడానికి వీల్లేదు. తప్పనిసరిగా విచారణను ఎదుర్కోవాల్సివుంటుంది. 
 
మరోవైపు, పీఎంఎల్ ఎన్ పార్టీ ప్రధాని అభ్యర్థి షాబాజ్ షరీప్ స్పందిస్తూ, తాము కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడబోమని స్పష్టం చేశారు. అలాగే, ఎవరినీ అరెస్టు చేయమని చెప్పారు. అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఇదిలావుంటే, అవిశ్వాస తీర్మానానికి ముందే ఇమ్రాన్ ఖాన్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న అంశంపై చర్చ సాగుతోంది.