ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2017 (12:31 IST)

ఉత్తర కొరియాపై దాడికి దేవుడు అనుమతిచ్చాడు.. ఇక యుద్ధమే తరువాయి?

ఉత్తర కొరియాపై దాడికి దేవుడు అనుమతిచ్చాడట. దీంతో ఆ దేశంపై బాంబుల వర్షం కురిపించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంటే ఉ కొరియాపై ఏ క్షణమైనా అమెరికా యుద్ధానికి దిగే సంకేతాలు స్పష

ఉత్తర కొరియాపై దాడికి దేవుడు అనుమతిచ్చాడట. దీంతో ఆ దేశంపై బాంబుల వర్షం కురిపించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంటే ఉ కొరియాపై ఏ క్షణమైనా అమెరికా యుద్ధానికి దిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 
నిజానికి గత కొన్ని రోజులుగా ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం తెల్సిందే. ఇదివరకెన్నడూ లేని విధంగా.. ఏకంగా అమెరికా భూభాగంపైనే దాడికి ప్రణాళికలు రచిస్తున్నామని కిమ్ ప్రకటించడంతో ట్రంప్ అగ్గిమీదగుగ్గిలమయ్యారు.
 
అమెరికా అణుశక్తి ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. దీంతో ఉరు దేశాల మధ్య ఏ క్షణంలోనైనా ఏదైనా జరగొచ్చనే ఉత్కంఠ రెండు దేశాల్లోనూ ఉంది.. ఈ తరుణంలో డోనాల్డ్ ట్రంప్‌కు ఊహించని వ్యక్తి నుంచి మద్ధతు లభించింది. అధ్యక్షుడికి మత సంబంధమైన విషయాల్లో ఆత్మీయ సలహాదారుడైన ఓ వ్యక్తి ట్రంప్‌కు అండగా నిలిచారు.
 
'దుష్ట శక్తులను అంతమొందించడానికి రాజ్యాల అధినేతలకు దేవుడు ఎప్పుడో అనుమతి ఇచ్చాడు. ఈ విషయం బైబిల్‌లో రోమన్స్ చాప్టర్‌లో స్పష్టంగా ఉంది. దేశ రక్షణ కోసం, దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఉత్తర కొరియాపై బాంబుదాడులు చేసేందుకు దేవుడు అనుమతినిచ్చాడు. కిమ్‌జాంగ్ పీచమణిచేందుకు దారిచూపించాడు'.. అంటూ ట్రంప్‌కు ఎవాంజిలికల్ అడ్వైజర్ రోబెర్ట్ జెఫెర్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
టెక్సాస్‌లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్‌లో వేలాది మందికి ప్రార్థన సేవలు అందించే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఈ విషయంలో ట్రంప్‌కు మద్ధతు పెరిగితే.. కచ్చితంగా ఉత్తర కొరియాపై దాడికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 
 
మరోవైపు... అమెరికా ప్రజలు యుద్ధం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ రాత్రి హాయిగా నిద్రపోవచ్చని ఆ దేశ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెక్స్ టిల్లర్సన్ భరోసా ఇచ్చారు. అమెరికాలోని గువాం దీవిపై దాడి చేస్తామని ఉత్తరకొరియా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఆరువేల మంది సైనికులు పహారా కాస్తున్నారన్నారు. తమ అధీనంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు రక్షణ కల్పించడం అమెరికా బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
 
ఉద్రిక్తతలు తొలగించుకునేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడితో తమ అధినేత ట్రంప్ మాట్లాడాలనుకున్నారని, కానీ ప్రస్తుతం పరిస్థితులు చేయిదాటిపోయాయని, అలాంటి పరిస్థితి కనిపించడం లేదని ఆయన తెలిపారు. యుద్ధం గురించి అమెరికన్లు భయపడాల్సిన పని లేదని ఆయన స్పష్టం చేయడం గమనార్హం.