శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 జనవరి 2021 (09:40 IST)

ఆఖరి రోజుల్లో అవమానం.. ట్రంప్‌పై అభిశంసన తీర్మానం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదవీ కాలం ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. కానీ, ఆయన తన చివరి రోజుల్లో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా ఆయనపై డెమొక్రట్లు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ పది రోజుల్లోనే ఆయన్ను గద్దె దింపేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. 
 
అమెరికాకు గుండెలాంటి క్యాపిటల్ హిల్స్ భవనంపై ట్రంప్ పిలుపు మేరకు ఆయన మద్దతుదారులు, అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడితో అమెరికాతో పాటు ప్రపంచం యావత్తూ ఉలికిపాటుకు గురైంద. ఈ దాడి ఘటనను డెమొక్రాట్లు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
 
ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడడం, వారిని అడ్డుకునే క్రమంలో అదికాస్తా హింసాత్మకంగా మారడం వంటి ఘటనలు ట్రంప్‌కు తలవంపులు తెచ్చి పెట్టాయి. ట్రంప్ వల్ల అమెరికా పరువు మంట కలిసిపోయిందన్న ఆగ్రహంతో ఉన్న డెమోక్రాట్లు.. ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు అభిశంసన తీర్మానానికి ముందుకొచ్చారు.
 
రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం ట్రంప్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతూ డెమొక్రాట్లు సోమవారం ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, రిపబ్లికన్ సభ్యులు దీనిని అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ నాన్సీ పెలోసీ రిపబ్లికన్లపై విరుచుకుపడ్డారు. అవాంఛనీయ, అస్థిరమైన, అవాస్తవమైన దేశద్రోహ చర్యలను కొనసాగించేందుకు ట్రంప్ వీలు కల్పించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
25వ సవరణను అమలు చేయాలన్న డిమాండ్‌పై మంగళవారం సాయంత్రం సభలో ఓటింగ్ జరగనుంది. దీనిపై స్పందించేందుకు ట్రంప్‌కు పెలోసీ 24 గంటల సమయం ఇవ్వనున్నారు. ఆ తర్వాత డెమోక్రాట్లు అభిశంసన ఓటుతో ముందుకు వెళ్లనున్నారు. కాగా, ట్రంప్‌పై అభిశంసనకు కాబోయే అధ్యక్షుడు బైడెన్ బహిరంగంగా మద్దతు ఇవ్వకపోవడం గమనార్హం. డెలావర్‌లో కరోనా టీకా రెండో డోసు తీసుకున్న అనంతరం బైడెన్ మాట్లాడుతూ.. ట్రంప్ పదవిలో ఉండకూడదని తాను కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.