అమెరికాకు వీగర్ మహిళల జుత్తుతో ఉత్పత్తులు.. చైనాపై అమెరికా ఫైర్
చైనాలో సుమారు 10 లక్షల మందికిపైగా ముస్లింలు శిబిరాల్లో నిర్బంధంలో ఉన్నారు. వారిని నిర్బంధ కార్మికులుగా మార్చి.. అనేక వస్తువులను ఆ దేశం ఉత్పత్తి చేస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కంప్యూటర్ విడి భాగాలు, దుస్తులు, పత్తి, వెంట్రుకలకు సంబంధించిన ఉత్పత్తులను అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది.
కాగా, ఈ ఆరోపణలను ఖండించిన చైనా.. ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న వారికి వృత్తి, నైపుణ్య శిక్షణ, విద్యా వసతులు కల్పించేందుకే ఈ శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పుకుంటోంది. అయితే వీగర్ల నిర్బంధంపై మరోసారి అమెరికా విరుచుకుపడింది.
షింజియాంగ్ ప్రావిన్సులోని వీగర్ ముస్లింలపై చైనా అకృత్యాలను అమెరికా మరోసారి ఎండగట్టింది. వారి విషయంలో మారణహోమానికి ఏమాత్రం తీసిపోని చర్యలకు చైనా పాల్పడుతోందని తీవ్రంగా మండిపడింది. అక్కడి మైనార్టీల స్థితిగతులపై యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రీన్ మాట్లాడుతూ..'అది మారణహోమం కాకపోతే, అలాంటిదే ఏదో జరుగుతోంది' అంటూ ఓ ఆన్‌లైన్ కార్యక్రమంలో భాగంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'వీగర్ మహిళల జుత్తును తీసివేసి, దాంతో వెంట్రుకలకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసి, వాటిని అమెరికాకు పంపుతోంది' అంటూ ఓబ్రీన్ మండిపడ్డారు.