సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2019 (05:53 IST)

స్త్రీలపై నేరాల్లో 60శాతం అత్యాచారాలే!

దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాల్లో అధిక శాతం అత్యాచారాలకు సంబంధించినవే ఉంటున్నాయి. రెండో స్థానంలో వరకట్నపు చావులు, హత్యలు ఉన్నాయి. మహిళలపై అత్యధికంగా నేరాలకు పాల్పడుతున్నది యువతేనని జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించింది.

సమాజంలో మహిళకు సమాన హక్కులు ఏమో గానీ స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా పొందలేకపోతోంది. తనను రక్షించుకునే పరిస్థితిలో లేని మహిళ నిస్సహాయంగా మిగులుతోంది. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాల్లో అధిక శాతం అత్యాచారాలకు సంబంధించినవే ఉంటున్నాయి. మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఇవే 59.3 శాతం ఉండగా.. వరకట్నపు చావులు, హత్యలు రెండో స్థానంలో ఉన్నాయి.

భారత శిక్షాస్మృతి కింద 2017లో దేశం మొత్తం 1,21,997 మందికి శిక్షపడితే అందులో మహిళలపై నేరాలకు పాల్పడినవారు 18,165 మంది ఉన్నారని జాతీయ నేర గణాంక బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. నివేదిక ప్రకారం.. ఇందులో అత్యాచార కేసుల్లో శిక్ష పడినవారు 10,892 మంది ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
మహబూబ్​నగర్​ జిల్లాలో 17 రోజుల్లో 13 అఘాయిత్యాలు!
దిశ ఎన్​కౌంటర్​ తర్వాత ఏమైన మేలుకొన్నామా? ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోనే గత 17 రోజుల్లో మళ్లీ 13 అఘాయిత్యాలు జరిగాయి. అసలు సమాజం ఎటు పోతుంది. ఎందుకీ ఇన్ని దారుణాలు? దిశ దుర్ఘటన యావద్దేశాన్ని కదిలించింది.

సామాన్యుడి మొదలు దేశ ప్రధానమంత్రి దాకా అందరూ ‘అరే.. ఇలా జరిగిందేమిటీ! సమాజంలో ఇటువంటి దురదృష్టకర ఘటనలు మరెక్కడా పునరావృతం కాకూడద’ని అనుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ప్రజాగ్రహం పెల్లుబికిన నేపథ్యంలో వారం రోజులు తిరగ్గానే నలుగురు నిందితుల ఎన్‌కౌంటరు కూడా చకచకా జరిగిపోయింది.

అప్పటిదాకా పోలీసులపై రాళ్లు రువ్విన జనం ‘ఎన్‌కౌంటరు’ ఘటన తర్వాత పూలు చల్లారు. ఈ చర్యతో అమ్మాయిల వైపు దుర్భుద్ధితో చూడాలన్నా ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుందని అంతా చెప్పుకొన్నారు.

కానీ, దిశ ఉదంతం జరిగిన పక్షం రోజుల్లోనే ఇదే పాలమూరు ఉమ్మడి జిల్లా పరిధిలో పలు అత్యాచార.. వేధింపుల ఘటనలు వెలుగు చూశాయి. పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ మహిళలపై అకృత్యాలు ఆగలేదన్నది చేదునిజం.