శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2016 (11:29 IST)

భారత ఆర్మీ అమ్ముల పొదిలో అగ్ని మిస్సైల్-5... ప్రయోగం సక్సెస్

భారత ఆర్మీ అమ్ముల పొదిలో మరో అత్యంత శక్తివంతమైన అస్త్రం వచ్చిచేరింది. అత్యంత సుదూర లక్ష్యాలను ఛేదించగల ఖండాతర క్షిపణి అగ్ని-5ను రక్షణ శాఖ సోమవారం విజయవంతంగా ప్రయోగించారు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ఐ

భారత ఆర్మీ అమ్ముల పొదిలో మరో అత్యంత శక్తివంతమైన అస్త్రం వచ్చిచేరింది. అత్యంత సుదూర లక్ష్యాలను ఛేదించగల ఖండాతర క్షిపణి అగ్ని-5ను రక్షణ శాఖ సోమవారం విజయవంతంగా ప్రయోగించారు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ఐలాండ్ (వీలర్ ఐలాండ్) నుంచి ఉదయ 10 గంటలకు అగ్ని-5 దూసుకెళ్లింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి 6 వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగల ఈ మిస్సైల్‌ను డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేయడం విశేషం. అగ్ని-5 మిస్సైల్‌ను ప్రయోగించడం ఇది నాలుగోసారి. 
 
అగ్ని-5 క్షిపణి మొత్తం 17 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పుతో ప్రయోగదశలో 50 టన్నుల బరువు ఉంటుంది. దాదాపు 1.5 టన్నుల వరకు అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యంతో దీనిని రూపొందించిచారు. నావిగేషన్, మార్గనిర్దేశం, ఇంజిన్, వార్‌హెడ్ పరంగా అగ్ని 5 మిస్సైల్‌ను ఇంతకు ముందుకంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినట్టు డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ తరహా మిసైళ్లు అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్ ఇంగ్లండ్ దేశాలవద్ద మాత్రమే ఉన్నాయి. 
 
కాగా, అగ్ని 5 అందుబాటులోకి వస్తే చైనా సహా ఆసియా, యూరోప్, ఆఫ్రికాలోని పలు దేశాలపైనా గురిపెట్టవచ్చు. దీంతో అగ్ని5ను భారత గేమ్ చేంజర్‌గా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే భారత్ వద్ద అత్యంత శక్తివంతమైన అగ్ని 1,2,3,4 సిరీస్ బాలిస్టిక్ మిసైళ్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. తొలిసారి 2012 ఏప్రిల్ 19న ప్రయోగించగా... 2013 సెప్టెంబర్ 15న రెండోసారి ప్రయోగించారు. చివరిసారిగా గతేడాది జనవరి 31న ప్రయోగించారు.